Mahaa Daily Exclusive

  స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి డోర్ డెలివరీ..! దేశవ్యాప్త ముఠా గుట్టురట్టు..!

Share

  •  దేశవ్యాప్త ముఠా గుట్టురట్టు!
  • 21 రాష్ట్రాలకు సరఫరా.. ఏటా రూ.5 కోట్ల టర్నోవర్.
  •  వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్.

హైదరాబాద్, మహా.

దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయిని డోర్ డెలివరీ చేస్తూ కోట్లలో అక్రమ సంపాదనకు తెరలేపిన భారీ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. హెచ్-ఫాస్ట్ అధికారులు, గుడిమల్కపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (సీపీ) సజ్జనార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సత్యం మిశ్రాను అదుపులోకి తీసుకున్నామని, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ప్రధాన నిందితుడు సత్యం మిశ్రా మొదట పెయింటర్‌గా, ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. 2018లో గంజాయికి బానిసైన అతడు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో రాహుల్ జై, సచిన్ మిశ్రా, సంతోష్ అనే వ్యక్తులతో కలిసి ఒక సిండికేట్‌గా ఏర్పడ్డాడు. వీరంతా ఏకంగా తమ సొంత ఊరిలోనే గంజాయి పంటను సాగు చేయడంతో పాటు, గ్రామంలోని ఇతరుల నుంచి కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కస్టమర్లకు సరఫరా చేయడం ప్రారంభించారు. ఇలా స్పీడ్ పోస్ట్, కొరియర్ సేవల ద్వారా హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు తదితర మహానగరాలతో సహా ఏకంగా 21 రాష్ట్రాలకు తమ గంజాయి నెట్‌వర్క్‌ను విస్తరించారు.

పోస్టల్ అధికారుల కళ్లుగప్పేందుకు పార్సిళ్లలో ప్రాణదాత అయిన మందులు ఉన్నాయని వీరు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చేవారు. జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్, ఫుస్రో పోస్టాఫీసుల నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ పార్సిళ్లు బుక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా సరఫరాదారులు, కస్టమర్ల మధ్య ప్రత్యేక కోడ్స్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్ జరిగేవి. రోజుకు 80 నుంచి 100 వరకు ఆర్డర్లు వస్తుండగా, అందులో 8 నుంచి 10 ఆర్డర్లను స్పీడ్ పోస్ట్ పార్సిళ్ల ద్వారా పంపేవారు. ఒక్కో పార్సిల్‌లో 50 నుంచి 250 గ్రాముల గంజాయిని ఉంచి, దానిని కస్టమర్లకు రూ.1,500 నుంచి రూ.8,000 వరకు విక్రయించేవారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఫోన్‌పే, యూపీఐ ద్వారానే సాగాయి. ఈ చీకటి వ్యాపారం ద్వారా రోజుకు సుమారు రూ.లక్ష ఆదాయం గడిస్తూ, నెలకు రూ.30 లక్షల నుంచి 35 లక్షలు, ఏడాదికి ఏకంగా రూ.4 నుంచి 5 కోట్ల టర్నోవర్ సాధించారు. ఇలా వచ్చిన అక్రమ సంపాదనతో నిందితులు బంగారం, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు, పలు బ్యాంక్ ఖాతాలు, ఫోన్‌పే యూపీఐ ఐడీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఎస్సార్ నగర్, గుడిమల్కపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చిన అనుమానాస్పద పార్సిళ్లపై నిఘా ఉంచి దర్యాప్తు చేయడంతో ఈ ముఠా బండారం బయటపడింది. హైదరాబాద్‌కు వచ్చిన రెండు పార్సిళ్లు విమానం ద్వారానే వచ్చినట్లు విచారణలో తేలింది. రైళ్లు, విమానాల ద్వారా రవాణా అయ్యే స్పీడ్ పోస్ట్ పార్సిళ్లకు సరైన స్కానింగ్ వ్యవస్థ లేకపోవడమే ఈ ముఠాకు కలిసొచ్చిందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు, పోస్టల్ పార్సిళ్లకు స్కానింగ్ తప్పనిసరి చేస్తూ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖలకు లేఖ రాయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే, నగరంలోని అన్ని కొరియర్ సంస్థలు ప్రతి పార్సిల్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఎవరికైనా అనుమానాస్పద పార్సిళ్లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.