Mahaa Daily Exclusive

  భారత పర్యటనలో ఊహించని విషాదం..! విదేశీ మహిళ మెదడులో 38 నులిపురుగులు..

Share

  •  విదేశీ మహిళ మెదడులో 38 నులిపురుగులు!
  •  అడవిపంది మాంసం తినడమే శాపంగా మారిందా?
  • కోలుకునేందుకు పదేళ్ల నరకం అనుభవించిన యూకే బాధితురాలు.

ఢిల్లీ, మహా.

భారత పర్యటన ఓ విదేశీ మహిళ జీవితంలో పూడ్చలేని విషాదాన్ని, దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. సరదాగా సాగిపోవాల్సిన టూర్ తర్వాత ఆమె పదేళ్ల పాటు ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. భారత్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత ఆమె శరీరంలో మొదలైన నులిపురుగుల సమస్య ఏకంగా ఆమె మెదడును తొలిచేసింది. మెదడులోకి చేరిన 38 పురుగుల కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుని, రెండు సర్జరీల తర్వాత అతికష్టం మీద ప్రాణాలు దక్కించుకుంది.

**మూడేళ్ల తర్వాత బయటపడిన లక్షణాలు**

వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన 42 ఏళ్ల లోవ్రీ డెన్‌మ్యాన్ అనే మహిళ 2007లో మూడు నెలల పాటు భారత్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా ఆమె అడవి పంది మాంసం తిన్నది. టూర్ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిన ఆమెకు మూడేళ్ల తర్వాత, అంటే 2010లో తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి. యూకేలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో టాయిలెట్‌లో తన శరీరంలో నుంచి నులిపురుగులు పడటాన్ని ఆమె గుర్తించింది. వెంటనే వైద్యులను సంప్రదించి స్టూల్ టెస్ట్ చేయించుకున్నప్పటికీ, రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని తేలింది.

**మెదడులో 38 పురుగులు**

అయితే, ఆ రిపోర్టులు వచ్చిన ఏడాది తర్వాత నుంచి ఆమెకు తరచుగా తలనొప్పి రావడం ప్రారంభమైంది. 2011లో తొలిసారిగా ఆమె పక్షవాతానికి (సీజర్స్‌) గురై ఆస్పత్రి పాలైంది. అక్కడ వైద్యులు సీఏటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలు నిర్వహించగా దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె మెదడులో ఏకంగా 38 నులిపురుగులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ అని పిలుస్తారు. ఆ తర్వాత సుమారు రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్న ఆమె.. అంతా కుదుటపడిందని భావించి ఇంటికి వచ్చేసి సాధారణ జీవితం గడపడం ప్రారంభించింది.

**పదేళ్ల నరకయాతన.. రెండు సర్జరీలు**

కొన్నేళ్ల పాటు సాఫీగానే సాగిన ఆమె జీవితంలో మళ్లీ ఆ పాత సమస్య తిరగబెట్టింది. ఓ రోజు ఆఫీసులో పనిచేస్తుండగా లోవ్రీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, మెదడులో తీవ్రమైన వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో ఆమెకు రెండుసార్లు సర్జరీలు నిర్వహించారు. ఈ నులిపురుగుల దెబ్బ నుంచి ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఏకంగా పదేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. ఎట్టకేలకు 2017 నుంచి ఆమెకు ఎలాంటి పక్షవాతం రాలేదు. అయినప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు, భవిష్యత్తులో ఎలాంటి ముప్పు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఇప్పటికీ యాంటీ-సీజర్ మందులను వాడుతూనే ఉన్నారు.