Mahaa Daily Exclusive

  దయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్‌ఎస్ తీరు..! మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై మంత్రి పొంగులేటి తీవ్ర ధ్వజం..

Share

  •  మీ గూండాగిరికి భయపడేది లేదు.
  •  వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు.
  • మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై మంత్రి పొంగులేటి తీవ్ర ధ్వజం.

హైదరాబాద్, మహా.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల పాటు అహంకారంతో, దొరల పోకడలతో ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా పాలన సాగించిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గులాబీ నేతల వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. బీఆర్‌ఎస్ గతంలో తాము చేసిన అవినీతి బురదను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటించాలని చూస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల విలువ కంటే మూడు రెట్లు ఎక్కువ అవినీతి జరిగిందంటూ వారు చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టివేశారు.

**చర్చకు మేము సిద్ధం.. మీరే పలాయనం**

ప్రజా సమస్యలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తాము చర్చకు సిద్ధమైతే బీఆర్ఎస్ నేతలే పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. సవాల్ విసిరిన విధంగానే గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ మంత్రులు గంటసేపు వేచి చూశారని, కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్ పేర్లతో టైమ్ పాస్ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల గూండాగిరికి భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరని తేల్చిచెప్పారు. వారు భవిష్యత్తులో కూడా ఇదే తీరును కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయన హెచ్చరించారు.

మతిభ్రమించే ఎన్నికల సవాల్

గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టారో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవివరంగా ప్రజల ముందు ఉంచారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసరడం వారి మతిభ్రమణానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో అధికారం కట్టబెట్టి స్పష్టమైన తీర్పునిచ్చారని, ఆ ప్రజా తీర్పును ప్రతిపక్షాలు హుందాగా గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.