Mahaa Daily Exclusive

  మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి..! కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు…

Share

  • అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే ఇద్దరికీ ఇవ్వొచ్చు.
  • అవినీతిపై చర్చకు సిద్ధం.. తేదీ, సమయం మీరే చెప్పండి.
  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల నేతల వ్యవహార శైలిపై తనదైన శైలిలో సెటైర్లు గుప్పించారు. గురుకులాల టెండర్లు, రాష్ట్ర అప్పులతో పాటు ఇరు పార్టీల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
ఆ రెండు పార్టీల నేతల నటన అద్భుతంగా ఉందని, ముందే రిహార్సల్ చేసుకుని మరీ పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ‘వారెవ్వా… మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి. అబద్ధాలు ఆడటంలో మీకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. తెలంగాణ ప్రజలకేమీ తెలియదనుకుంటున్నారా? మీ డ్రామాలను చూసి వారు నవ్వుకుంటున్నారు’ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇలాగే నాటకాలు ఆడితే ప్రజలు ఛీ కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను, వారి అవినీతిని ప్రజల ముందు ఉంచేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో చర్చకు సంబంధించిన తేదీ, సమయం, వేదికను ఖరారు చేస్తామని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని ఆయన నిలదీశారు.
అదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో నడుస్తున్న ఈ రాజకీయ బిగ్‌బాస్ షోలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ‘డబుల్ ఎలిమినేషన్’ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ (బీజేపీ ప్రభుత్వం) రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.