Mahaa Daily Exclusive

  ప్రవాస భారతీయుల ఐక్యతకు ప్రతీకగా స్వాతంత్య్ర వేడుకలు..! మాతృభూమి, మాతృభాష, భారతీయ సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జి డ్యూ టి సి యస్ నేతలు..

Share

ఢిల్లీ మహా,
సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జి డ్యూ టి సి యస్ అధ్యక్షులు రవి అడుసుమిల్లి, కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించగా, అనంతరం ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న నిర్వాహకులు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పరస్పరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రవాస భారతీయులు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ మాతృభూమిపై ప్రేమ, భారతీయ సంస్కృతిపై గౌరవాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.

ఈ సందర్భంగా అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవితాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న స్వేచ్ఛను నేడు అనుభవిస్తున్న మనమంతా భారతదేశ అభివృద్ధి, జాతీయ సమైక్యత కోసం మరింతగా పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ప్రపంచంలోని ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆయా దేశాల చట్టాలను గౌరవిస్తూ, భారతీయులుగా తమ ఐక్యతను, సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ 80 ఏళ్ల స్వతంత్ర భారతం అనేక మంది మహనీయుల కలల సాకారం, అసంఖ్యాక వీరుల త్యాగాల ఫలితమన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు, అహింసావాదుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమును ప్రేమించుమన్నా… మంచి అన్నది పెంచుమన్నా… వొట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేల్ తలపెట్టవోయి’ అనే సందేశాన్ని గుర్తుచేస్తూ దేశభక్తి కేవలం మాటల్లో కాకుండా ప్రతి ఒక్కరి ఆచరణలోనూ ప్రతిబింబించాలని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా మాతృభూమి, మాతృభాష, భారతీయ సంస్కృతి పట్ల బాధ్యతతో వ్యవహరించాలని భానుప్రకాష్ మాగులూరి కోరారు. యువతే దేశానికి బలం, భవిష్యత్తు అని పేర్కొంటూ జాతీయ సమైక్యత, సహోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రవాస భారతీయ సంఘాలు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమం అనంతరం భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను ఉప్పుటూరి రామ్‌చౌదరి, భానుప్రకాష్ మాగులూరి తదితర ప్రవాస పెద్దలు కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశం, ప్రవాస భారతీయుల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారు వివరించారు.

ఈ వేడుకల్లో సీతారామారావు ఎండూరు, చంద్రనాధ్ నంబూరు, వల్లభనేని వీరభద్రరావు, కందుల అభిరామ్, చింతా రాంబాబు, శ్రీకాకుల రామ సత్యనారాయణ, అన్నం పూర్ణచంద్రరావు, రాధాకృష్ణ మైనేని, ఐతా భిక్షపతి, సూరేపల్లి బ్రహ్మం, సి.హెచ్. సత్యనారాయణ, చిట్టెల సుబ్బారావు, జంపాల కృష్ణమోహన్, డాక్టర్ అల్లం లింగం, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, చెరుకూరి ఇందుశేఖర్, పి. నర్సింగరావు, యాదగిరి గుండా తదితరులు పాల్గొన్నారు. ప్రవాస భారతీయుల ఐక్యత, దేశభక్తి, మాతృభూమి పట్ల మమకారం, భారతీయ సంస్కృతి పరిరక్షణ పట్ల వారి నిబద్ధతకు ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.

Latest