Mahaa Daily Exclusive

  పాల్వంచ చెక్ పోస్టులో.. పైసా వసూల్..

Share

  • ప్రైవేట్ వ్యక్తులతో అధికారుల దందా
  • ముడుపుల మత్తులో అక్రమాలకు రైట్ రైట్
  • అక్రమ ఇసుక రవాణా లారీలే టార్గెట్
  • పశువులు, గంజాయి రవాణా వీరి కనుసైగల్లోనే
  • మంత్రి హెచ్చరించినా అదే దందా
  • ప్రతిరోజూ లక్షల్లో వసూళ్ళు

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, మహా :

కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు అసలు కంటే కొసరే ఇష్టం. ఆమ్యామ్యాల మత్తులో మునిగి తేలుతూ.. అసలు బాధ్యతలు విస్మరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూనే సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే లంచావతారమెత్తి అవినీతి జలగలుగా తమను పట్టి పీడీస్తున్నారని వాహన దారులు లబోదిబోమంటున్నారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ ఆర్‌టీఏ చెక్‌పోస్టులో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు అక్రమ ఆదాయం కోసం పక్క దారి పట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్ట్ పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వారి ద్వారా పనులు చక్కబెడుతున్న అధికారులు ప్రతి వాహనానికి ఒక్కో రేటు నిర్దారించి వాహనాలు తనిఖీలు చెప్పట్టకుండా రైట్ రైట్ చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీవాహనం నుండి మూడు చక్రాల ఆటో వరకు ఈ చెక్ పోస్ట్ ముందు నుండి కదలకుండా కేవలం ముడుపుల వైపే దృష్టి పెట్టారనేది వాహన యజమానుల ఆరోపణ. చెక్ పోస్ట్ సిబ్బంది వారి స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు సమాచారం. కొన్నేండ్లుగా ఈ లంచాల వ్యవహారం అటెండర్ నుంచి అధికారి వరకు యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగం రహస్యంగా కనిపిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ అక్రమ దందా పై శాఖా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై విస్మయం వ్యక్తమవుతోంది. మా దందా.. ఇంతే అన్నట్లుగా ప్రైవేట్ సైన్యం, వారికి అండగా కీలక అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూసి విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతీనెలా.. కోట్లల్లోనే ఈ దందా సాగుతుందన్న ఆరోపణలున్నాయి.

 

వారి రూటే.. సపరేటు..

 

పాల్వంచ ఆర్‌టీఏ చెక్‌పోస్టులో సిబ్బంది, అధికారులు బార్డర్‌ ట్యాక్స్‌, తాత్కాలిక పర్మిట్‌ ఫీజు, అపరాధ రుసుం, వాహన ఇన్సూరెన్స్, తదితర దృవపత్రాలు తనిఖీలు చేయాలి. వస్తువుల రవాణాకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా..? లేవో..? చెక్ చేయాలి. కానీ ఇదంతా ఏం జరగకుండా చేతులు తడిపితే వాహనాలు వదిలేస్తున్నారనేది నిత్య కృత్యంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నా కానీ ఇక్కడే కొందరు అవినీతికి తెరలేపారు. వారి రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పత్రాలు ఉన్నా లేకున్నా వాహనదారుల నుంచి డబ్బులు దండుకొని వాహనాలు వదిలేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి విచ్చలవిడిగా సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారిందని, చేతులు తడపనిదే వాహనాలు వదలడం లేదంటూ, అన్ని రకాల దృవపత్రాలున్న ఆర్టిఏ సిబ్బంది ప్రతి వాహనం పై రూ.500 నుంచి వసూళ్లు చేస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక, కలప, ఇతరత్రా అనుమతి లేని జీరో దందా రవాణాకు.. చేతులు తడిపితే జీహుజూర్ అంటూ గేట్లు ఎత్తేస్తారన్న చర్చ సర్వత్రా ఉంది. వీటి రేటు సపరేటు అన్నట్లుగా పై స్థాయిలోనే ఫిక్స్ అయిందన్న ప్రచారం స్థానిక వర్గాల్లో ఉంది.

 

అక్రమ ఇసుక రవాణా లారీలే టార్గెట్..

 

భద్రాద్రి జిల్లాలోని మణుగూరు, చర్ల, భద్రాచలం, పినపాక ఇసుక ర్యాంపు ల నుండి ప్రతిరోజు వందలాది లారీలు ఈ చెక్కు పోస్ట్ మీదుగా ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, హై దరాబాద్ కు ప్రయాణిస్తుంటాయి. ఇదే రవాణా శాఖ అధికారులుకు వరంగా మారింది. టన్నేజి, ఓవర్ లోడు పేరుతో ఒక్కో లారీ నుండి రూ. వెయ్యి నుండి మూడు వేల వరకు ఆర్టీఏ చెక్ పోస్టులో పెద్ద సార్ ఉన్నారంటూ వాహనదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పెద్ద సారు ఎవరనేది సిబ్బందికి మాత్రమే తెలుసు. కొందరు జిల్లా అధికారుల పేర్లు చెప్పి, ప్రజాప్రతినిధుల అండ ఉందని చెబుతూ ఇష్టానుసారంగా దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వాహనానికి ఏ చిన్న కాగితం లేకున్నా వాహనం సీజ్ అవుతుందేమోనని వాహనదారులు భయపడి తమ జేబులో ఉన్న డబ్బులను సిబ్బందికి ఇచ్చి అక్కడ నుంచి జారుకుంటున్నారు. సిబ్బంది బహిరంగానే వసూళ్లు చేస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాహనదారులు వాపోతున్నారు.

 

పశువులు, గంజాయి రవాణా వీరి కనుసైగల్లోనే

 

ఈ చెక్ పోస్ట్ లో కొందరు ప్రైవేటు వ్యక్తులు అధికారుల కనుసైగల్లో పశువులు, గంజాయి రవాణా చేసే వాహనాల వద్ద భారిగా అక్రమ వసూళ్లకు పాల్పడటం విశేషం. అక్రమ వ్యాపారాలు తమ రవాణా వాహనాలను అడ్డుకోకుండా ముందస్తుగానే మాట్లాడుకొని నెలవారి మామూళ్లు ముట్ట చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చెక్ పోస్ట్ పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి రాజ్యమేలుతుందనే చెప్పాలి . కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని అక్రమంగా సంపాదిస్తున్నారని వినికిడి. చెక్ పోస్టులో జరుగుతున్న వసూళ్లపై అధికారులు నిఘా పెట్టాలని, రాష్ట రవాణా శాఖ మంత్రి హెచ్చరించిన సిబ్బంది, అధికారుల తీరు మారడం లేదని, చెక్ పోస్ట్ లో జరుగుతున్న అక్రమాల ఫై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చెక్కు పోస్ట్ ను ప్రక్షాళన చేయాలని వాహన దారులు కోరుతున్నారు.

Latest