Mahaa Daily Exclusive

  చెస్ అకాడమీ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ హామీ

Share

  •  ప్రఖ్యాత క్రీడాకారిణి కోనేరు హంపితో భేటీ.
  •  చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని భరోసా.

అమరావతి, మహా.

రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక చెస్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రఖ్యాత అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఆమె తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చెస్ క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారు చర్చించారు.

అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో చెస్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కోనేరు హంపి మంత్రికి విజ్ఞప్తి చేశారు. హంపి ప్రతిపాదన పట్ల మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ.. అకాడమీ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

కాగా, ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌ వేదికగా జరిగిన 46వ ఎఫ్‌ఐడీఈ చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో హంపి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వ్యక్తిగత విభాగంలో బోర్డు-1 పైన ఆమె అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఘన విజయం సాధించి దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన కోనేరు హంపిని మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు.