- యువతరం ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
- “అప్పా– మా నాన్న జి.డి.నాయుడు” పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
హైదరాబాద్, మహా : యువత ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లి రిడ్జ్ హోటల్ లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో “అప్పా- మా నాన్నజి.డి.నాయుడు” పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రముఖ ఆవిష్కరణ కర్త, పారిశ్రామిక వేత్త, సాంకేతిక విద్యకు పునాది వేసిన, జి.డి.నాయుడుగా ప్రసిద్ధిచెందిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు గారి జీవిత చరిత్రను ఆయన కుమారుడి దృక్పథంతో ప్రసిద్ధ తమిళ రచయిత్రి శివశంకరి గారు రచించిన గ్రంథాన్ని ఇసనాక మురళీధర్ గారు తెలుగులోకి అనువదించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతీయ ఆవిష్కరణల రంగానికి దిక్సూచిగా నిలిచి, ‘భారత ఎడిసన్’గా పేరుగాంచిన విజ్ఞాన శాస్త్ర విప్లవ ప్రదాత గోపాల స్వామి దొరైస్వామి నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన ఈ పుస్తకం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. జి.డి. నాయుడు కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదని, వ్యాపారం తెలిసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. మూడో తరగతిలోనే బడి మానేసి, స్వయంకృషితో అసాధారణ నైపుణ్యాలను సంపాదించుకున్న ఆయన ప్రస్థానం యువతకు పాఠం కావాలన్నారు. “చదువు జ్ఞానాన్ని ఇస్తే… నైపుణ్యం జీవితాన్ని అందిస్తుంది” అని ఉద్ఘాటించారు. బ్రిటిష్ కాలంలోనే మోటార్ సైకిల్‌పై మక్కువతో ప్రారంభమైన ఆయన ప్రయాణం, ‘యునైటెడ్ మోటర్ సర్వీస్’ ద్వారా దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి రవాణా సంస్థగా ఎదిగేలా చేసిందని గుర్తుచేశారు.
విద్యుత్, యాంత్రిక, ఆటోమొబైల్, వ్యవసాయ రంగాలలో ఆయన చేసిన ఆవిష్కరణలు అసాధారణమని, స్వదేశీ విద్యుత్ మోటార్‌ను అభివృద్ధి చేయడం, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఓటింగ్ మెషీన్లు, జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్లు, రేడియోలు వంటి అనేక యంత్రాలను ఆయన సృష్టించారని తెలిపారు. శాస్త్రవేత్త సి.వి. రామన్ సైతం ఆయన్ని “కోటికొక్కరు” అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్న జి.డి. నాయుడు భారతదేశపు మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి, తక్కువ ఖర్చుతో కూడిన గృహ నిర్మాణ పద్ధతులను, కొత్త పంట వంగడాలను అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ప్రజలు సౌకర్యవంతంగా జీవించడానికే ఆవిష్కరణలని, ఆ పనిని ఆ రోజుల్లోనే జి.డి.నాయుడు చేసి చూపించారని, యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నట్లుగా, యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే ఉన్నత వ్యాపారవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ పుస్తకం కేవలం ఒక జీవిత చరిత్ర కాదని, ప్రతి కుటుంబంలోనూ పిల్లలకు అందించాల్సిన స్ఫూర్తి దీపమని పేర్కొంటూ… మహనీయుల ఆదర్శాలను ఆచరణలో పెట్టి ‘వికసిత భారత’ నిర్మాణానికి యువత చోదక శక్తులు కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. జి.డి.నాయుడుగారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. జి.డి.నాయుడుకి రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆయనకు తగిన గుర్తింపునివ్వాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆయన జీవిత చరిత్రను దేశప్రజలందరూ తెలుసుకోవాలని, ఈ పుస్తకాన్ని హిందీలోకి అనువదింపచేయడానికి చొరవ తీసుకుంటానని చెప్పారు. పుస్తకం తొలి ప్రతిని సినీ నిర్మాత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ స్వీకరించారు. కార్యక్రమంలో జి.డి.నాయుడు మనమడు, జి.డి.నాయుడు ఛారిటీస్ ట్రస్టీ జి.డి.రాజ్ కుమార్, పుస్తక సంపాదకులు గుడిపూడి సుబ్బారావు, పుస్తక అనువాదకులు ఇసనాక మురళీధర్, పుస్తక సమీక్షకులు, సీనియర్ పాత్రికేయులు మాశర్మ తదితరులు పాల్గొన్నారు.








