Mahaa Daily Exclusive

  గిరిజనులకు ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ!

Share

  •  ఎల్‌నినో కరువు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందడుగు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తబోయే కరువు పరిస్థితులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పూర్తి భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి ఉపాధి లేమి ఏర్పడకుండా, వలసలను పూర్తిగా నివారించే దిశగా ఉపాధి హామీ పథకం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశాల మేరకు, ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఈ దిశగా పకడ్బందీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కష్టకాలంలో గిరిజన కుటుంబాలకు అండగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమైంది.

కొత్త జాబ్ కార్డుల జారీ.. అర్హులైన ప్రతి కుటుంబానికి చోటు

రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు జాబ్ కార్డులు లేని అర్హులైన ప్రతి కుటుంబాన్ని తక్షణమే గుర్తించి కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఈ జాబ్ కార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ‘విశ్వకర్మ-గ్రామీణ ఉపాధి హామీ’ పథకం కింద అర్హులైన ప్రతి ఆదివాసీ, గిరిజన కుటుంబానికి ఏడాదికి కనీసం 125 రోజులపాటు ఉపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల కరువు పరిస్థితులు ప్రభావం చూపకుండా గిరిజన కుటుంబాలకు నిలకడైన ఆర్థిక భద్రత లభించనుంది.

జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు.. పకడ్బందీ పర్యవేక్షణ

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, గిరిజనులకు 125 రోజుల పాటు ఉపాధి పనులు సజావుగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, ఉపాధి పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఈ చొరవతో గిరిజన ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలకు పెద్దఎత్తున ఆర్థిక భరోసా లభించడమే కాకుండా, ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వలస వెళ్లే దుస్థితికి పూర్తిగా చెక్ పడనుంది.