Mahaa Daily Exclusive

  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.

Share

  •  కౌలాలంపూర్‌ వెళ్తుండగా రూ. 1.56 కోట్లతో ఇద్దరి అరెస్ట్!
  •  హవాలా ముఠాల గుట్టురట్టు.
  •  డీఆర్‌ఐ అధికారుల మెరుపు దాడిలో బట్టబయలైన అక్రమ నగదు రవాణా!

హైదరాబాద్, మహా.

అంతర్జాతీయ విమానాశ్రయాలను వేదికగా చేసుకుని సాగుతున్న అక్రమ నగదు రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు విజయవంతంగా రట్టు చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన అత్యంత చాకచక్యమైన ఆకస్మిక తనిఖీలలో కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్ పయనమవుతున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద భారీ ఎత్తున లభ్యమైన అక్రమ నగదును సీజ్ చేసిన అధికారులు, వారిని అదుపులోకి తీసుకుని విచారణను తీవ్రతరం చేశారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా బలగాలు మరియు డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన నిఘాలో ఈ గుట్టు రట్టయింది. కౌలాలంపూర్‌కు విమానం ఎక్కేందుకు సిద్ధమైన ప్రయాణికుల కదలికలపై అనుమానం వ్యక్తమగడంతో అధికారులు వారి లగేజీని, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి వద్ద ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేదా పత్రాలు లేకుండా తరలిస్తున్న సుమారు రూ. 63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. అదే సమయంలో, అదే విమానంలో ప్రయాణించాల్సిన మరో ప్రయాణికురాలిని కూడా అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, ఆమె వద్ద ఏకంగా రూ. 91.94 లక్షల విలువైన విదేశీ కరెన్సీ బయటపడింది. ఇద్దరి వద్ద లభించిన ఈ భారీ మొత్తాన్ని లెక్కగట్టగా దాదాపు రూ. 1,55,56,000గా తేలింది.

విదేశీ మారకద్రవ్య నిర్వహణ నిబంధనలు (ఫెమా) మరియు కస్టమ్స్ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించి ఈ నిధులను విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరి ఆదేశాల మేరకు కౌలాలంపూర్‌కు తరలిస్తున్నారు? దీని వెనుక ఏదైనా పెద్ద హవాలా రాకెట్ లేదా అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలో డీఆర్‌ఐ అధికారులు కూలంకషంగా దర్యాప్తు జరుపుతున్నారు. విదేశీ కరెన్సీని అక్రమంగా దేశం దాటించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కరెన్సీ ఏయే దేశాలకు చెందినది, ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో ఇంకెవరెవరికి సంబంధాలున్నాయనే పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విమానాశ్రయ వేదికగా జరుగుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత కఠినతరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.