- ఫార్ములా ఈ రేసు కేసు
- విచారణకు హాజరు కాని కేటీఆర్
- డిసెంబర్ 4కు వాయిదా
హైదరాబాద్, మహా : సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ వాయిదా పడింది. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే కేసులో మరో నిందితుడైన స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర రావు విచారణ ప్రారంభ సమయానికి హాజరుకాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సమయానికి విచారణకు హాజరుకాని కారణంగా కిరణ్ మల్లేశ్వరరావుపై ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత ఆయన కొంత ఆలస్యంగా కోర్టుకు చేరుకోవడంతో, జారీ అయిన వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యక్తిగత ఇతర కారణాల వల్ల కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో భాగంగా దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్‌పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ డిశ్చార్జ్ పిటిషన్‌పై తమ కౌంటర్ దాఖలు చేయడానికి ఏసీబీ తరఫు న్యాయవాదులు మరికొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. శుక్రవారం నాడు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఏసీబీ న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.







