Mahaa Daily Exclusive

  ఆప్ఘనిస్థాన్ పాకిస్థాన్ ల మధ్య యుద్దం..

Share

ఆప్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ ఇపుడు బాంబులతో విరుచుకుపడుతోంది. అప్ఘనిస్థాన్ లోని పాక్‌టీకా రాష్ట్రం బర్మాల్ జిల్లాలో ఈ బాంబు దాడులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ కి సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతంలోని ఏడు గ్రామాలు బాంబు దాడులకు గురికాగా.. అందులోని లామాన్ గ్రామంలో ఎక్కువ మంది చనిపోయారు. ఈగ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. నివాసాల మధ్య బాంబు దాడులు జరగడంతో.. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వాటిని తొలగిస్తే.. మరింత మంది మృతులు బయటపడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. అర్థరాత్రి వేళ పాకిస్థాన్ యుద్ధ విమానాలు అటుగా వచ్చినట్లు ఈ గ్రామస్థులు చెబుతున్నారు. పాకిస్థాన్ సైన్యమే బాంబు దాడులు చేసిందని ఆరోపిస్తున్నారు. బాంబు దాడుల్ని ఖండించిన తాలిబన్లు.. తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. తమ దేశాన్ని కాపాడుకునే హక్కు, అధికారం తమకున్నాయన్న ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి త్వరలోనే దాడులకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

ఈ దాడుల్ని క్రూరమైన చర్యగా అభివర్ణించిన అఫ్గాన్ తాలిబన్లు.. ఇటువంటి ఏకపక్ష చర్యలతో సమస్యలకు పరిష్కారం కనుక్కోలేరంటూ పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ రక్షణ రంగ నిపుణులు దీనిపై స్పందించారు. ఇస్లామాబాద్‌కు చెందిన భద్రతా నిపుణుడు సయ్యద్ ముహమ్మద్ అలీ.. ఈ ఘటనపై మాట్లాడారు. వైమానిక దాడి పాకిస్థానీ తన సరిహద్దుల లోపల, బయట ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందన్నారు. అందుకోసం ఎలాంటి దాడులకైనా వెనకాడదని అన్నారు. పాకిస్తాన్ తాలిబాన్‌కు ఈ దాడులు స్పష్టమైన, గట్టి హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. అయితే.. అఫ్ఘాన్ ప్రభుత్వం చెబుతున్నట్లు.. పౌర నివాసాలపై పాకిస్థాన్ దాడులు చేయలేదని, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దెబ్బతీసేలా దాడులు జరిగాయన్నారు. పౌరుల ప్రాణ, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా పాకిస్తాన్ తగిన జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. పాకిస్థాన్ జరిపిన ఈ దాడులు తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) అనే గ్రూపు మిలిటెంట్లు లక్ష్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆ గ్రూప్.. ఇస్లామిస్ట్ అతివాద గ్రూప్, ఇది పాక్ – అఫ్ఘాన్ బోర్డర్ నుంచి తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ గ్రూప్ 2007లో బైతుల్లా మెహసూద్ అనే నాయకుడు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం నూర్ వలీ మెహసూద్ నాయకత్వంలో పనిచేస్తోంది. పాక్ లోని చాలా తాలిబన్ గ్రూపులు వీరితో కలిసి పని చేస్తున్నాయి. పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం, అక్కడ తీవ్రవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ గ్రూప్ ఆఫ్ఘన్ లోని తాలిబన్లకు మద్ధతు ఇస్తోంది. 2001-2021 మధ్య అమెరికాతో యుద్ధం సమయంలో తాలిబన్లకు అండగా నిలిచింది. ఈ కారణంగానే.. ఈ మిలిటెంట్ గ్రూప్ నకు తాలిబన్ల నుంచి గట్టి మద్ధతు లభిస్తోంది. ఈ గ్రూప్ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించిన పాకిస్థాన్.. దీన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో.. టీటీపీ గ్రూప్ ను నిర్మూలించేందుకు ఆఫ్ఘన్ తాలిబాన్‌ నేతల్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ.. ఆ ప్రయత్నం జరగకపోగా, వారిని రక్షించేందుకు పాక్, టీటీపీ మధ్య చర్చలకు తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ చర్చల్లో భాగంగా.. పాకిస్థాన్ అదుపులో ఉన్న అనేక మంది టీటీపీ తీవ్రవాద ఖైదీలు విడుదలయ్యారు. పైగా.. ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సైతం కుదిరింది. తాలిబన్ల అండదండలు, పాకిస్థాన్ నుంచి ప్రమాదం తగ్గడంతో తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) గ్రూప్ క్రమంగా బలపడుతూ వచ్చింది. సైద్దాంతిక భావజాలాన్ని కలిగిన అనేక చిన్నచిన్న గ్రూపులు.. ఈ టీటీపీ గ్రూప్ తో కలిసిపోవడంతో.. దీని కార్యకలాపాలు పెరిగిపోయాయి. దీంతో.. ఆఫ్ఘనిస్తాన్‌లోని అభయారణ్యాల నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలపై టీటీపీ దాడులను ప్రారంభించింది. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులపై వరుస దాడులు చేస్తూ.. పాకిస్థాన్ సైన్యానికి సవాళు విసురుతున్నారు. దీంతో.. ఈ గ్రూప్ కట్టడిపై ఆలోచన చేస్తున్న పాకిస్థాన్… పాక్ ఇంటిలిజెన్స్ అధికారుల పక్కా సమాచారం మేరకు ప్రస్తుత దాడులు చేసినట్లు చెబుతోంది. గతంలోనూ అనేక సార్లు ఈ గ్రూప్ కార్యకలాపాలపై దాడులు చేసిన పాక్ ఆర్మీ.. అఫ్ఘాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం మొదటిసారి. ప్రస్తుతం పాకిస్థాన్ లోని రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని.. అక్కడి ఆర్మీ, సైనిక స్థావరాలపై తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) వరుస దాడులు చేస్తోంది. వీటికి ప్రతీకారంగా.. పాక్ ప్రస్తుతం వైమానిక దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు ఇస్లాం దేశాల మధ్య జరుగుతున్న వార్ ఆందోళన కలిగిస్తోంది.

……