- రైతులకు పండుగ
- ఇంటింటా.. సంతోషాల వెలుగులే లక్ష్యంగా
- ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం
(మహా, హైదరాబాద్ )
సంక్రాంతి అంటే వ్యవసాయం చేసే రైతులు ధాన్యం రాశులు పోసి, కుటుంబమంతా గుంపులుగా చేరి, సంతోషాన్ని పంచుకునే రోజు. ఇపుడు ఆ సంక్రాంతిని మరింత కాంతిగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి ఇంటికీ కానుకల కాంతి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును ముఖ్యమంత్రి పూర్తిచేశారు. ఈనెల 30న జరిగే కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుండగా, సంక్రాంతికి ప్రతీ పల్లెలో సంతోషంగా వెల్లివెరిసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా రైతులకు పండుగ చేయనుంది. ఇప్పటికే వడ్లకు బోనస్ తో రైతులకు ఊరటనిచ్చిన ప్రభుత్వం హామీనిచ్చినట్లుగా రైతుభరోసా కూడా ప్రారంభించనుంది. ప్రతీ రైతు ఖాతాలో టింగ్ టింగ్.. టింగ్ అంటూ మోతమోగేలా ఎకరానికి రూ.7,500చొప్పున నగదు వేయనుంది. ఇంకా ఎన్నో పథకాలు.. ఎన్నో కార్యక్రమాలు. ఈ సంక్రాంతి మామూలుగా ఉండదని రేవంత్ సర్కార్ ఊరిస్తోంది.
రైతు భరోసా షురూ
ఈ సంక్రాంతికి రైతుభరోసా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. రైతు భరోసా కింద తొలి విడత నిధులను జమ చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం అందుకోసం విధివిధానాలను కూడా ఖరారు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించేలా తొలుత నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 10 ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే నిధులను అందజేస్తారు. ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా జమ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రామాల్లో ప్రభుత్వానికి సానుకూలత పెరగనుంది. జనవరి 10కల్లా కేబినెట్ సబ్ కమిటీ నివేదికలు ఫైనల్ చేసి, రైతుభరోసా నిధులను సంక్రాంతికి ముందు రోజు నుండే వేసే అవకాశాలున్నాయి. రెండు పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు రైతుభరోసా పథకంలో చెల్లిస్తారు. రైతులకు సంబంధించి ఇప్పటికే 2లక్షల రుణమాఫీ పూర్తిచేయడంతో పాటు బోనస్ ద్వారా ప్రభుత్వం రైతుల విశ్వాసం పొందుతోంది. రైతుభరోసా అమలైతే రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లవుతుంది.
ఇందిరమ్మ ఇండ్లకు సై
ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతికి ప్రారంభించనుంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేయనుంది. ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను దశల వారీగా విడుదల చేయనుంది. దీని కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ యాప్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి వెల్లడించారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతుందని.. లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జనవరి 10లోపు జాబితాలు ఫైనల్ చేసి, సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతీ మండలంలో కొన్ని ఇళ్ళయినా మంజూరీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతికి అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ళపథకం ప్రారంభించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త కార్డులొస్తున్నాయ్
కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా సంక్రాంతి నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల శాసనసభ సమావేశాల్లో దీనిని ప్రకటించారు. కొత్త రేషన్‌కార్డులకు సుమారు 10 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటికే ఉన్నకార్డు ల్లో అదనంగా సభ్యుల చేర్పులకు 26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కసరత్తుచేసి సంక్రాంతి నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు చేసి, క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకొని డిజిటల్ కార్డులను పంపిణీకి చర్యలు చేపట్టనున్నారు.
ఈ మూడు తర్వాత.. స్థానిక మూడ్
ఈ మూడు పథకాలను ప్రారంభించి స్థానిక సమరానికి ప్రభుత్వం సై అనే అవకాశాలున్నాయి. మూడు పథకాలను ప్రారంభించగానే మండలపరిషత్, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సంక్రాంతి లోగా బిసి కమిషన్ నివేదికలు కూడా ప్రభుత్వానికి అందనుండగా, రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకుని ఈ సంక్రాంతి నుండి గ్రామాల్లో రాజకీయ వేడిని కూడా రగిలించనుంది.
…………







