Mahaa Daily Exclusive

  తెలంగాణలో బ్లాక్ బెర్రీ ఐలాండ్..

Share

మహా: ప్రకృతి అందాలంటే ఎవరైనా ఇష్టపడుతారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల కిలకిల, ఇసుక తిన్నెలు, జంతువుల సందడి, మధురమైన శబ్ధం చేస్తూ పారే నదుల అందాన్ని చూడాలి.. అక్కడ కొద్దిసేపు సేద తీరాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ములుగు జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడవుల అందాన్ని ప్రజలకు చూపించి కనువిందు చేయాలన్న ఉద్దేశంతో ‘బ్లాక్ బెర్రీ ఐలాండ్’ కు శ్రీకారం చుట్టింది. తాడ్వాయి – పస్ర మధ్య అటవీ ప్రాంతంలో ఎకోటూరిజం మరియు అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ ఐలాండ్ ను ఏర్పాటు చేసింది. జలగులాంచా వాగు మధ్యలో సుమారు ఐదు ఎకరాలలోని ప్రకృతి వనంలో ఈ ద్వీపాన్ని ఏర్పాటు చేసింది. రాత్రి సమయంలో అయితే ఈ ఐలాండ్ మెరిసే వెలుగులతో కనువిందు చేస్తుంది.

 

అందాలు తలుక్కుమనేలా..

పర్యాటకుల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ఈ ఐలాండ్ లో ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ వెదురు బొంగులను కూడా ఏర్పాటు చేశారు. బీచ్ వాలీబాల్ తరహా కోర్టులు, షటిల్ కోర్టులు, ఖోఖో, కబడ్డీతోపాటు పలు ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేక ఆటా స్థలాలు, ముఖ్యంగా చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేశారు. వాగులో ఫిషింగ్ చేసుకునే సదుపాయం, ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఇష్టాం మేరకు భోజనం తయారు చేసి వడ్డించే రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. రకరకాల రుచులతో పర్యాటకులకు పరిచయం చేసేందుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకారులను అందుబాటులో ఉంచారు. ఈ రెస్టారెంట్ ను ఇసుక తిన్నెల నడుమ ఏర్పాటు చేశారు. పర్యాటకులు చుట్టూ పచ్చని చెట్ల అందాన్ని తిలకిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకు వంటకాలను రుచి చూసేలా ఆ ఇసుక తిన్నెల్లో ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో ఆ రెస్టారెంట్ వద్ద ప్రత్యేక వెలుగులు విరజిమ్మేందుకు ప్రత్యేక లైట్లను అమర్చారు. రంగురంగులతో లైట్ల వెలుగుల మధ్య రెస్టారెంట్ వినూత్నంగా కనిపిస్తూ పర్యాటకులను తెగ ఆకర్శిస్తుంది. వీటితోపాటు సోలార్ విద్యుత్ సుదపాయం అందుబాటులో ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఇక్కడ బస చేసేలా ఏర్పాట్లు సైతం చేశారు. ప్రత్యేకమైన గూడారాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉండేలా 25 గుడారాలు, ముగ్గురు ఉండేలా 21 గుడారాలు, నలుగురు ఉండేలా 4 గుడారాలను ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ వెదురు బొంగులతో కూడిన కంచెలను ఏర్పాటు చేశారు. ఇసుక తిన్నెల్లో ఆ గూడారాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆహ్లాద వాతావరణంలో వినోదాత్మకంగా ఉన్నాయి.

 

 

చలిమంటల్లో సరదా ముచ్చట్లు

స్వచ్చమైన గాలి పీల్చుకుంటూ కుటుంబ సమేతంగా సరదాగా గడిపే వాతావరణం అందుబాటులో ఉంది. కుటుంబ సమేతంగా చలిమంటలు కాచుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకునే విధంగా క్యాంప్ ఫైర్ ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మధ్యలో మంట, దాని చుట్టూ కూర్చుని మంట కాచుకునేలా క్యాంప్ ఫైర్ ను ఏర్పాటు చేశారు. వీటితోపాటు పర్యాటకులకు అడవినంతా చూపించాలనే ఉద్దేశంతో మంచెను సైతం ఏర్పాటు చేశారు. ఇది అదనపు ఆకర్షణగా నిలిచింది. దీనిని భారీ ఎత్తులో ఏర్పాటు చేశారు. ఆ మంచెను ఎక్కి చూస్తే అడవింతా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ దీవికి వచ్చే పర్యాటకులకు సహాయం చేసేందుకు ప్రత్యేక సిబ్బంది సైతం అందుబాటులో ఉండనున్నారు. మొత్తంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆనందంగా వెనుదిరిగేలా ఈ దీవిని ఏర్పాటు చేశారు.

 

 

దేశ విదేశీయులను సైతం ఆకర్షించేలా..

దేశ విదేశీయులను సైతం ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు చేరుకోవడం చాలా సులువు. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకోవొచ్చు. రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 220 కిలో మీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. దీనిని సందర్శించిన తరువాత పర్యాటకులు సమీపంలోనే ఉన్న రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, బోగత వాటర్ ఫాల్స్ ను సందర్శించొచ్చు. అందంగా తీర్చిదిద్దిన ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను ఇటీవలే మంత్ర సీతక్క సైతం సందర్శించి పరిశీలించారు. అందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. త్వరలోనే దీనిని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఈ ఐలాండ్ రాష్ట్రానికి కాదు.. దేశానికే పేరు తెస్తుందని ఆకాంక్షించారు.

 

ఎలా చేరుకోవాలంటే…?

తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ బ్లాక్ బెర్రీ దీవికి చేరుకోవొచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్రా వద్ద దిగితే ఇక్కడికి చేరుకోవొచ్చు. అదేవిధంగా ఏపీ నుంచి రావాలంటే భద్రాచలం వచ్చే బస్సుల్లో ఎక్కి భద్రాచలం వద్ద దిగాలి. అక్కడి నుంచి వరంగల్, హైదరాబాద్, హనుమకొండ వైపుగా వస్తే ఇక్కడికి చేరుకోవొచ్చు.

 

ధరల వివరాలు…

బ్లాక్ బెర్రీ దీవికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను సైతం రూపొందిస్తున్నారు. అయితే, ధర విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రోజుకు సుమారుగా రూ. 2 వేల వరకు ఉండే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.