- హెచ్చరికలు బేఖాతర్
- బిల్లు వెనుక
మాజీ ప్రధాని మన్మోహన్ తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రజలతో మన్మోహన్ సింగ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఆవిర్భావం జరిగింది. 2009 -2014 మధ్య కాలంలో తెలంగాణ కోసం ప్రతీ అడుగు మన్మోహన్ ఆచి తూచి వేసారు. ఏపీ ఎంపీల రాజీనామాల హెచ్చరికలు .. రాజకీయ ఒత్తిళ్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం అమలు వెనుక మన్మోహన్ నేర్పు ఎంతో ఉంది. బిల్లు రూప కల్పనలో నాడు ప్రధానిగా మన్మోహన్ కీలక భూమిక పోషించారు. రాజ్యసభలో ఏపీకి హామీలు ఇచ్చారు. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటానికి ముగింపు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే లభించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల స్వరాష్రం మన్మోహన్ హయాంలోనే నెరవేరింది. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రకటన నుంచి ఆవిర్భావం వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ, సోనియా ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రధాని హోదాలో రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ కే దక్కుతుంది. రాష్ట్ర విభజన వేళ మన్మోహన్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో పూర్తి స్థాయి మెజారిటీ లేదు. కానీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన మన్మోహన్ తెలంగాణ ఏర్పాటు సాధ్యం చేసారు. డిసెంబర్ 9, 2009 న నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటన చేసారు. ఆ వెంటనే ఆంధ్ర నేతలు, ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీమానా చేసేందుకు సిద్దమయ్యారు. ఏపీ నుంచి నాటి మన్మోహన్ కేబినెట్ లో చిరంజీవితో సహా అయిదుగురు మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్ లో లగడపాటి పెప్పర్ స్ప్రేతో హంగామా చేసారు. కానీ, మన్మోహన్ వెనుకడుగు వేయలేదు. ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ ప్రధాని హోదాలో మన్మోహన్ పాత్ర గురించి నాటి హోం మంత్రి షిండే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ బిల్లు సమయంలోనూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అభి ప్రాయాలను మన్మోహన్ పరిగణలోకి తీసుకున్నారు. పార్లమెంట్ లో 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు ఆమోదం వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత వెంకయ్య నాయుడు మద్దతు కావాలంటే కొన్ని షరుతులు విధించారు. ఏపీకి ప్రత్యేక హోదా తో పాటుగా కేంద్ర సంస్థలను కేటాయిస్తామని రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ హామీ ఇచ్చారు. దీంతో, రాజ్యసభలోనూ తెలంగాణ బిల్లు ఆమోదంతో కొత్త రాష్ట్ర కల సాకారమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారమని మన్మోహన్ తరువాతి కాలంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు భౌతికంగా దూరమైనా మన్మోహన్ ను తెలంగాణ ఎప్పటికీ మర్చిపోదు.







