కడప, మహా: రాయలసీమ డిక్లరేషన్ పై బీజేపీ ప్రజాప్రతినిధులు స్పందించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా సీతారాం ఏచూరి (అజమత్ ఫంక్షన్ హాల్) ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, కర్నూలుకు చెందిన పార్థసారథి, మంత్రి సత్య కుమార్ రాయలసీమ డిక్లరేషన్ అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రయత్నించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు తేవాలన్నారు. రాయలసీమ సమస్యలు పట్టించుకోకపోతే ప్రజలు క్షమించాలని హెచ్చరించారు. కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి భూముల ఆక్రమణ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. అదే సమయంలో భూస్వాములు లక్షలాది ఎకరాలను పేదలకు దక్కకుండా ఆక్రమించుకొని ఉన్నారని, వాటిపై విచారణకు ఎందుకు ఆదేశించారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు రామమోహన్, మనోహర్, శివకుమార్ పాల్గొన్నారు.







