Mahaa Daily Exclusive

  దేహభక్తుల్లో నిజమైన దేశభక్తుడు!

Share

మాజీ ప్రధాన‌మంత్రి మన్మోహన్ సింగ్ నిష్క్ర‌మ‌ణ‌తో భార‌త‌ దేశ ఆర్థిక‌, రాజకీయ రంగంలో ఒక శకం ముగిసింది. యావత్​ భారతం బాధలో మునిగిపోయింది. రెండు పర్యాయాలు విజయవంతంగా దేశ ప్రధానిగా, అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్​బీఐ గవర్నర్​గా పలు ఉన్నత పదవులు చేపట్టిన ఆయన గురించి చాలా మంది రాజకీయ నాయకులు, పలు రంగాల ప్రముఖులు త‌మ‌కు ఆయ‌న‌తో ఉన్న అనుభ‌వాలు, జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. మౌన ముని అని నిందించిన వారు కూడా నేడు ఆయన రాజకీయ చతురతను, స్థితప్రజ్ఞత‌ను కొనియాడకుండా ఉండలేని పరిస్థితిని బట్టే ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. రేవంత‌న్న నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆయన మృతి వార్త‌ తెలిసిన వెంటనే ఒకరోజు సెలవు ప్రకటించింది. వారం పాటు సంతాప దినాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర‌నేత‌లంతా మ‌న్మోహ‌న్ సింగ్ అంతిమ‌ సంస్కారాల్లో పాల్గొన్నారు. శాస‌న‌స‌భ‌ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై మ‌హా నేత‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించ‌డం ద్వారా ఆయన ప్రధానిగా ఉండగా ఏర్పడిన రాష్ట్రం త‌న కృత‌జ్ఞ‌త‌ను చాటుకుంది.

డాక్టర్​ మన్మోహన్‌ సింగ్​ దేశం కిష్టమైన సమయంలో పదేండ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తేకాదు, నవ భారతానికి ఆర్థిక రంగంలో నడక నేర్పిన మహనీయులు. భారత జాతి ముద్దుబిడ్డ. అన్నింటికీ మించి గొప్ప దేశభక్తుడు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ సహకారంతో సిక్కు సామాజిక వ‌ర్గం నుంచి ఈ దేశానికి నాయకత్వం వహించిన తొలి నేత. పదేండ్ల పాటు ప్రధానమంత్రిగా దేశానికి విస్తృత సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. ఆర్థిక రంగంలో ఒక సూపర్‌ పవర్‌గా నిలిచింది. మ‌న దేశాన్ని ఐదు ట్రిలియ‌న్ ఎకాన‌మీగా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ఘంటాపథంగా చెబుతున్నారంటే అందుకు నెహ్రూ, ఇందిరా, మ‌న్మోహ‌న్ వంటి వారు వేసిన పునాదిపైనేని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఆర్థిక‌వేత్త‌గా, రాజ‌కీయ నాయ‌కునిగా ద్విపాత్రను పోషించిన నాయ‌కుడు మ‌న దేశ రాజ‌కీయ య‌వ‌నిక‌పై కేవలం మ‌న్మోహ‌న్ మాత్ర‌మే. 2008లో యూఎస్ఏలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాల మీద మీద పడ్డా దాని ప్ర‌భావాన్ని మ‌న దేశంపై ప‌డ‌కుండా అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన ప్రారంభించిన విధానాలతోనే ఇప్పటికీ పేదలు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు క‌లుగుతోంద‌నేది ఎవ్వరూ కాదనలేని స‌త్యం. అటువంటి మహనీయుడిని బీజేపీ నేత‌లు ఇష్టారీతిన విమ‌ర్శించారు. స్వ‌యంగా ప్ర‌ధాని మోడీయే రాజ్య‌స‌భ సాక్షిగా మన్మోహన్​ను అవహేళన చేసిన విష‌యం యావ‌త్ దేశ‌మంతా వీక్షించింది. ఆయ‌న నిజాయితీని శంకించారు. సీబీఐ ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ విచార‌ణ సంస్థ‌ల ద్వారా ఆయ‌న్ను ఇబ్బంది పెట్టాల‌ని చూశారు. కానీ, ఆయన నిబద్ధత, నిజాయితీ ఏంటో దేశ‌మంతా చూసింది. ఇక ఆ మ‌హ‌నీయుడి అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సంకుచిత స్వభావంతోనే ప్రవర్తించడం దారుణం. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీని వల్ల ప్రధానుల అంతిమ దహన సంస్కారాల్లో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మన్మోహన్‌ సింగ్‌ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా కేంద్ర ప్ర‌భుత్వం వ్యవహరించింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించి తక్కువ చేయాలని చూసింది. బీజేపీ ఎంత తక్కువ చేసి చూపెట్టాలనుకున్నప్పటికీ ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్మరనీయులుగానే ఉంటారు. మన్మోహన్‌సింగ్‌కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని కాంగ్రెస్​ పార్టీ అధి నాయకత్వం డిమాండ్ చేస్తున్నది.

తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ త్యాగ ఫలితంగా దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా మన్మోహన్​ సింగ్​ ప్రధానమంత్రి అయ్యారు. ఆడంబరాలు లేని నాయకుడు, అవినీతి ఆరోపణలు అసలే లేని స్వచ్ఛపరుడు. అత్యంత నిజాయితీపరుడు. ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త, దేశం కీర్తి పొందిన నాయకుడు. ఆయన హయాంలోనే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ చ‌ట్టం-2013, కనీస వేతనం, గిరిజనుల అటవీ హక్కులు వంటి కీలక నిర్ణయాలు చ‌ట్టాల రూపు దాల్చాయి. అవే నేడు దేశ స్థితిని, గతిని మార్చాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయ‌న‌ కీలక పాత్ర పోషించారు. అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డంలోనూ… జ‌స్టిస్ బీఎన్ శ్రీకృష్ణ క‌మిటీ ఏర్పాటు చేయ‌డంలోనూ…. గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్స్​ ఏర్పాటులో మన్మోహన్​ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. అటు ప్రపంచంలో, ఇటు దేశంలో మూడు ముఖ్య ఉద్యోగాలు చేసి కూడా, అపార్టుమెంట్ ఇంటికే యజమాని మాత్రమే అయిన సామాన్య అసామాన్యుడు. ఆయన ఎంతటి సౌమ్యుడో చెప్పేందుకు నేను ఇక్కడ ప్రత్యేకంగా ఒక విష‌యం ప్ర‌స్తావిస్తాను. ప్రధానిగా ఆయన చివరిసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… “ప్ర‌స్తుతం కాలంలో మీడియా, దేశంలోని రాజ‌కీయ‌ ప్రతిపక్షాలు నన్ను దూషించ‌వ‌చ్చు… విమర్శించవచ్చు. కానీ, చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నా. పాలనా వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను. కానీ, ఒక మాట చెప్పగలను. సంకీర్ణ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా… ఏ పరిస్థితుల్లో, దేశహితంలో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాను.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో చిన్న రాజకీయ పదవికే ఎంతో అహంభావం చూపిస్తున్న తరుణంలో… ఈ దేశంలోనే అత్యున్నత పదవి చేపట్టిన వ్యక్తి మాటలు నిజంగా మనకు ప్రజాస్వామ్యంపై మరింత ఇష్టాన్ని కలిగేలా చేస్తాయి. కాంగ్రెస్ (యూపీఏ) మొదటి, రెండో పర్యాయంలో వచ్చిన నిర్ణయాలు, శాసనాలు గత ముప్పయి ఐదేండ్లుగా రాలేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న మన్మోహన్‌ సింగ్‌ లేచిన వెంటనే తన ఆరోగ్యం గురించో… ఆపరేషన్​ గురించో అడుగుతారని వైద్యులు ఆయన పక్కన ఉన్నవారు అనుకుంటే, ఆయన మాత్రం దేశం ఎలా ఉందని అడగటంలో అక్కడివారంతా అవాక్కయ్యారంటే ఆయనకు దేశం మీద ఉన్న ప్రేమ, అభిమానం అర్థం చేసుకోవచ్చు. ‘దేశం ఎలా ఉంది? కశ్మీర్‌ ఎలా ఉంది?’ సర్జరీ గురించి నాకు ఎలాంటి బెంగ లేదు. నా దేశం గురించే నా ఆలోచనంతా’ అన్నారట. కానీ, ఈ రోజు మనం కొంతమంది నాయకులను చూస్తున్నం. అధికారం ఉంటేనే కనపడటం… లేదంటే జనాలకు దూరంగా ఉండటం నిశితంగా గమనిస్తున్నాం. ఇక ఇంకొంతమంది నాయకులు మాత్రం సోషల్​ మీడియాలో స్టంటులు, రీల్స్​, యూట్యూబ్​లో షాట్స్​ కోసం మాత్రమే పని చేస్తున్నారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం అధికార యావ మాత్రమే ఉండటం చూస్తున్నాం.

మన్మోహన్‌ సింగ్‌ చేపట్టిన సంస్కరణలు ఈ రోజు టెలిఫోన్​, డిజిటల్​ రంగాల్లో, భారత స్టాక్‌ మార్కెట్లలో గొప్ప మార్పునకు కారణమయ్యాయి. ఆయన విధానాల ఫలితంగా పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్‌ మారింది. ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా సింగ్‌ హయాంలో చేపట్టిన సరళీకృత విధానాలు, మార్కెట్‌ సానుకూల విధానాలతో భారత స్టాక్‌ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్‌ వంటి రంగాలు అంతర్జాతీయ సవాళ్లలోనూ మంచి ప్రతిఫలాలను చూపుతున్నాయి. ఆయన తీసుకొచ్చిన విధానాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం లభించింది. ఆయన సేవల్ని ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా దేశ ఆర్థిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఆయ‌న ముద్ర‌ను ఎవ‌రూ చెరిపివేయ‌లేరు. దేశ ప్రజల హృదయాల్లో ఆయ‌న స‌దా నిలిచి ఉంటారు. ముఖ్యంగా పేదలు, గిరిజనులు, అతి సామాన్యులకు ఆయ‌న ఆరాధ్య దైవంగా ఉంటార‌న్న‌ది అక్ష‌రస‌త్యం.

సత్తు మల్లేష్​, గ్రంథాలయ కమిటీ ఛైర్మన్​, కరీంనగర్​.

Latest