Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ‌వారికి త‌ప్ప‌కుండా త‌గిన గుర్తింపు, గౌరవం దక్కుతుంది – మంత్రి సీతక్క

Share

కాంగ్రెస్ పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ‌వారికి త‌ప్ప‌కుండా త‌గిన గుర్తింపు, గౌరవం ద‌క్కుతుంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎప్ప‌డొచ్చినా పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌దేన‌ని కాంగ్రెస్ పెద్ద‌లు సూచించారు. మావ‌ల మండ‌ల ప‌రిధిలోని ప‌ద్మ‌నాయ‌క్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి స‌భా అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రిగింది. ఈ మీటింగ్‌కు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్ర‌ట‌రీ విశ్వ‌నాథ‌న్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క ముఖ్యఅతిథులుగా విచ్చేసి పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌లంభించాల్సిన వ్యూహాల‌ను సూచించారు.

ప‌దేండ్ల త‌ర్వాత తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చామ‌ని, అదంతా కార్య‌క‌ర్త‌ల శ్ర‌మ‌, క‌ష్టం వ‌ల్ల‌నే సాధ్యం అయ్యింద‌ని, వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విస్మ‌రించ‌బోమ‌ని, అన్ని విధాలుగా అండ‌గా నిల‌బ‌డి గుర్తింపు, గౌర‌వంద‌క్కేలా చూస్తామ‌ని కాంగ్రెస్ పెద్ద‌లు అభ‌య‌మిచ్చారు. ఆ పూచీ త‌మ‌ది అంటూ వారికి పూర్తిస్థాయి భ‌రోసా క‌ల్పించారు. ప‌దండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో విధ్వంసం జ‌రిగింద‌ని, ఎక్క‌డా అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ పాల‌న మొత్తం అవినీతిమ‌య‌మంటూ దుయ్య‌బ‌ట్టారు. కేవ‌లం వారి కుటుంబం బాగుప‌డింది త‌ప్పా తెలంగాణ స‌మాజం మొత్తం క‌ష్టాలు చ‌విచూసింద‌ని, అడుగ‌డుగునా నిర్బంధాలు ఎదుర్కొంద‌ని పేర్కొన్నారు. మిగులు బ‌డ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసి ఇవాళ వారే కాంగ్రెస్ ఏంచేయ‌డంలేదంటూ దుమ్మెత్తిపోయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్నో అమ‌లుకాని హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసగించార‌న్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా ప్ర‌భుత్వంలో కేవ‌లం యేడాదిలోనే అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేపట్టామ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వంలో ప్ర‌జాపాల‌న సాగుతోంద‌న్నారు. ఇప్ప‌టికే ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేశామ‌ని అన్నారు. సాంకేతిక కారణాల‌తో కొంత‌మంది రైతుల‌కు రైతు రుణ‌మాఫీ కాలేద‌ని, కానీ సాధ్య‌మైనంత త్వ‌ర‌లో పూర్తిస్థాయిలో మాఫీ చేసేలా చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ దండే విఠ‌ల్‌, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్‌, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్, మాజీ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యేలు అత్రం సక్కు, విఠ‌ల్‌రెడ్డి, రాథోడ్ బాపురావు, అజ్మీరా రేఖా నాయ‌క్‌, నారాయ‌ణ‌రావు ప‌టేల్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీష్‌, సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ కేంద్ర‌మంత్రి వేణుగోపాల‌చారి, నిర్మ‌ల్ డీసీసీ అధ్య‌క్షులు కూచాడి శ్రీ‌హ‌రిరావు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్య‌క్షులు విశ్వ‌ప్ర‌సాద్‌, కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిలు కంది శ్రీ‌నివాస‌రెడ్డి, ఆగే గ‌జేంద‌ర్‌, అజ్మీరా శ్యాంనాయ‌క్‌, రావి శ్రీ‌నివాస్‌, క‌రీంన‌గ‌ర్ గ్రంథాల‌య సంస్థ చైర్మెన్ స‌త్తు మ‌ల్లేష్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గోక గ‌ణేష్‌రెడ్డి, మున్సిప‌ల్ మాజీ వైస్ చైర్మెన్ దిగంబ‌ర్‌రావు పాటిల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌…
మావ‌ల మండ‌ల ప‌రిధిలోని ప‌ద్మ‌నాయ‌క్ గార్డెన్‌లో జ‌రిగిన పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశానికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున త‌ర‌లిరావ‌డంతో కోలాహ‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. హ‌స్తం పార్టీలో పూర్వ వైభ‌వం సంత‌రించుకుంది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారిగా ఆదిలాబాద్‌కు విచ్చేసిన మ‌హేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. త‌న‌దైన‌రీతిలో ప్ర‌సంగంతో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. తాను పార్టీ కోసం ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌కే మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తాన‌ని అన్నారు. వారి పార్టీకు బ‌లమ‌ని బ‌లంగా న‌మ్మేవారిలో మొద‌టివ‌రుస‌లో ఉంటానని స్ప‌ష్టం చేశారు. పైర‌వీల‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా నిబ‌ద్ధ‌త‌, నిజాయితీతో ప‌నిచేసేవారికి ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా క‌ల్పించారు. కార్యకర్తల శ్రమ, కష్టం వల్లనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. యేడాది గ‌డుస్తు్నా ఎలాంటి ప‌ద‌వులు లేక‌పోవ‌డంతో నిరాశ, నిరుత్సాహం ఉండవ‌చ్చ‌ని, కానీ దాన్నితీర్చే బాధ్యత త‌మ‌దేన‌న్నారు.
తప్పకుండా త్వరలో గ్రామ‌, మండ‌ల‌, జిల్లా కమిటీలను వేస్తామ‌ని, పార్టీని మరింత బలోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని అన్నారు. ఎన్నాళ్లుగానో చూస్తున్న ఎదురుచూపులకు సంక్రాంతి పండుగ‌ తర్వాత తెర దించుతామ‌ని, తీపి క‌బురు చెబుతామ‌ని శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. స్థానిక సంస్థల్లో బేష‌జాలు వీడి క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని, అభ్య‌ర్థులంద‌రినీ గెలిపించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తను క‌లుపుకు పోవాల‌న్నారు. సర్వే రిపోర్ట్ త‌మ వద్ద ఉంద‌ని, ఎవరికి అవకాశం కల్పించాలో త‌మ‌కు బాగా తెలుసున‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేత‌లు అధికారం కోల్పోయి నానా యాగి చేస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారన్నారు. వారికి స‌రైన రీతిలో స‌మాధానం చెప్పాలంటే స్థానిక సంస్థ‌లు హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌న్నారు.

మ‌న్మోహ‌న్ సింగ్‌కు ఘ‌న నివాళి
ఇటీవ‌ల మృతిచెందిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు కాంగ్రెస్ పెద్ద‌లు, పార్టీ శ్రేణులు ఘ‌న నివాళ్లు అర్పించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట్ విస్తృత‌స్థాయి స‌మావేశంలో భాగంగా మ‌న్మోహ‌న్ సింగ్ చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళ్ల‌ర్పించారు. ఆయ‌న దేశానికి అందించిన ఎన‌లేని సేవ‌ల‌ను ఏఐసీసీ, టీపీసీసీ పెద్ద‌లు స్మరించుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం కాంగ్రెస్ పార్టీకి, దేశ రాజ‌కీయాల‌కు తీర‌ని లోట‌ని పేర్కొన్నారు. ఒక గొప్ప మేథావిని కోల్పోయామ‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా మీటింగ్ కు విచ్చేసిన కాంగ్రెస్ పెద్ద‌లు, అతిథుల‌కు ఉమ్మడి జిల్లా నేత‌లు, నాయ‌కులు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికి వారిని శాలువాలు, పూల‌బోకేల‌తో స‌త్క‌రించారు. వారితో ఫొటోలు దిగుతూ అభిమానం చూపించారు.

Latest