హ్యూమన్ మెటానిమో వైరస్(హెచ్ఎంపీవీ)పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా స్పందించారు. దేశంలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. హెచ్ఎంపీవీ కొత్తదేమీ కాదని, 2001లోనే ఆరోగ్య రంగ నిపుణులు ఈ వైరస్ ను గుర్తించారని ఆయన స్పష్టం చేశారు. చాలా ఏళ్ల నుంచి ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉందన్నారు. గాలి, శ్వాసక్రియ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వివరించారు. అన్ని వయసుల వారినీ ఈ వైరస్ ప్రభావితం చేస్తుందన్నారు. చలికాలం ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరంలేదన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. చైనాలో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చైనాతోపాటు ఇతర పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇందుకు సంబంధించిన ఓ నివేదికను త్వరలోనే షేర్ చేస్తుందన్నారు. ఐసీఎంఆర్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ తో దేశంలోని శ్వాసకోశ వైరస్ లకు సంబంధిత డేటాను సమీక్షించాయన్నారు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్క్ లు అలర్ట్ గా ఉన్నాయన్నారు. దేశంలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రతలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.








