గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన బిల్లుల్లో ఈజిఎస్ బిల్లులు తక్షణమే క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని చెప్పారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ధనసరి సీతక్క , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కొండా సురేఖ , ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు , వేం నరేందర్ రెడ్డి , మాజీ మంత్రి కె.జానారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు







