Mahaa Daily Exclusive

  నేను ఊరుకొన్నా.. ఆయన వదిలి పెట్టడు – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Share

అధికారులు బాధ్యత లేకుండా పని చేయడం వల్లే దుర్ఘటన

డీఎస్పీ రమణకుమార్‌‌తోపాటు గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి సస్పెండ్‌

ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమీలపై బదిలీ వేటు

అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు

తిరుపతి, మహా
కొంతమంది అధికారులు బాధ్యత లేకుండా పని చేయడం వల్లే.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డీఎస్పీ రమణకుమార్‌‌తోపాటు గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమీలపై బదిలీ వేటు వేస్తున్నామని తెలిపారు. తిరుపతి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను గురువారం సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనపై జ్యూడీషియల్ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. తిరుపతిలో బాధాకరమైన ఘటన చోటు చేసుకొందన్నారు. ఈ తొక్కిసలాట ఘటన తన మనస్సును కలచి వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమల పవిత్రత కాపాడే బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను పరామర్శించానని ఆయన వివరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాని తెలిపారు. తిరుమల దివ్య క్షేత్రమని.. దాని పవిత్రతను కాపాడుతామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అలాగే ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు సైతం చేశామని చెప్పారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలు లేదని ఈ సందర్బంగా ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇలాంటి ఘటనలు జరగ కూడదని ఓ భక్తుడిగా తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయాలతో దేవుడిని అప్రతిష్టపాలు చేయొద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. తాను ఊరుకున్నా ఆ దేవుడు వదిలిపెట్టడన్నారు.

Latest