Mahaa Daily Exclusive

  అజ్ఞాతం వీడి.. జనజీవన స్రవంతిలో కలవండి – సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా

Share

హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలంలోని వంగపాడు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మందా రూబెన్ అలియాస్ మంగన్న గత 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండగా.. ఆయన కుటుంబాన్ని శుక్రవారం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా పరామర్శించారు. ఈ సందర్బంగా రూబెన్ తల్లి చంద్రమ్మతోపాటు కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతోపాటు చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితిని డీసీపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమయ్య తల్లి చంద్రమ్మకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పంపించిన చీరతోపాటు కుటుంబ సభ్యులకు దుప్పట్లు, నిత్యావసర సరకులను పోలీసు అధికారులు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యం అని, ఇకనైనా రూబెన్ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలన్నారు. ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందన్నారు. ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని, అదేవిధంగా మందా రూబెన్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే, అతనిపై ఉన్న రివార్డ్ తోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషిచేస్తామని డీసీపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, స్పెషల్ బ్రాంచ్ 2 ఏసీపీ పార్థసారథి, హాసన్ పర్తి ఇన్స్ స్పెక్టర్ చేరాలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest