Mahaa Daily Exclusive

  మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు…!

Share

వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం దేశాయ్ పేట్ లోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సీకేఎం కళాశాల ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కళాశాల. ఎందరో మహానుభావులు ఈ కళాశాలలో విద్యను అభ్యసించి గొప్పవారు అయ్యారు. నేడు మనం చూస్తున్న ఎంతోమంది ప్రముఖులు, మేధావులు, రాజకీయ వేత్తలు ఈ కళాశాలలోనే విద్య నేర్చుకున్నవారే. నాటి తరంలో ఈ కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు విద్య పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినవారు కాబట్టే నేడు గొప్ప రంగాలలో రాణిస్తున్నారు. కానీ ఇప్పటి తరం విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి విద్యార్థి చదువుకునే వయసు నుండే అన్ని విషయాలతోపాటు సమాజంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని కోరారు. వాటి వలన కలిగే నష్టాల గురించి తెలియపరచడం
విద్యార్థులు తమ బాధ్యతగా భావించాలి. అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ పూర్తి జీవితాన్ని అనుభవించాలి. ప్రస్తుతం మన దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది.. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున మరణిస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే దాని పరిణామం మన మరణమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నిండు జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకొని కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగులుస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి.. ఎవరు ఎన్ని చెప్పినా మీ ప్రయాణ భద్రతే మీ ప్రాణానికి రక్ష అని తెలుసుకోండి. నిర్లక్ష్యాన్ని వీడండి నిండు జీవితాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలి’ అంటూ ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంతే జార్గంజ్ ఇన్స్పెక్టర్ ఏం ఎ షుకూర్, కళాశాల ప్రిన్సిపాల్, ఎన్ సీసీ కమాండర్ సతీష్ కుమార్, ఎన్ సీసీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.