ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీ సీఎం అతిషి సింగ్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరీనే బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని, ఈ మేరకు తనకు సమాచారం అందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ విషయమై రానున్న ఒకటిరెండు రోజుల్లో బీజేపీ అధికారికంగా ప్రకటించనున్నట్టు తమకు సమాచారం ఉన్నదని ఆయన తెలిపారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటితం కాబోతున్న రమేశ్ బిధూరీకి అభినందనలు ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో కూడా చెప్పాలన్నారు. ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించిన తరువాతనే ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలి అంటూ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలో వచ్చే నెల 5న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరగనున్నది. 8న ఫలితాలు వెల్లడి కానున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.







