ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ రైల్వేస్టేషన్లో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింది చిక్కుకున్న 11 మందిని వెలికితీశాయి. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కిందే చిక్కుకుని ఉన్న మిగతా కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రెస్క్యూ టీమ్స్తోపాటు స్థానిక అధికారులు, పోలీసులు ఈ సహాయక చర్యల్లో పాల్గొని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణమే అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ను అందించాలని వారికి సూచించారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.







