ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పోటీ చేస్తుంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న మొత్తం 15 మంది అభ్యర్థుల జాబితాను ఆర్పీఐ విడుదల చేసింది. న్యూఢిల్లీ నుంచి శుభి సక్సేనా, పాలం నుంచి వీరేందర్ తివారీ, మాలవీయనగర్ నుంచి రాంనరేష్ నిషాద్ తో పాటు పలువురు తదితర స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు నామినేషన్‌లు వేసేందుకు చివరి తేదీ. ఈ నెల 18న నామినేషన్‌ల స్క్రూటినీ నిర్వహించనున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు చివరి తేదీ. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.






