జనవరి 11, మహా: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఉన్నట్లుగానే పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఒకే పూట పని విధానం అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా శనివారం పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మున్సిపాలిటీలో పరిధిలోనైనా పనిచేస్తున్న కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారన్నారు. ‘కార్మికులందరూ తెల్లవారు జామున (ఉదయం) 5 గంటలకు వెళ్లి… ఉదయం 10 గంటలకు పనిలోంచి ఇంటి వెళుతుంటారు.. మరల మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లి… సాయంత్రం 5 గంటలకు దిగుతారు. ఇలా కాకుండా రెండుసార్లు రావడం, పోవడం కార్మికులకు ఇబ్బందిగా ఉంది’ అని ఆయన అన్నారు. అందువల్ల వారికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులు చేస్తే ఎనిమిది గంటలు పూర్తి అవుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకపూట కార్మికులకు పని విధానం కల్పించాలని కోరానన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చుట్టు పక్కల మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులకు ఒకే పూట విధానం పనులు చేస్తున్నారని గుర్తుచేశారు. ఒక్క పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలో పని చేసే కార్మికులు మాత్రమే రెండు పూటలా పనిచేస్తున్నారన్నారు. చాలా కాలం నుంచి ఒక పూట పని విధానం కల్పించాలని పదేపదే విన్నవించినా ఎవ్వరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా ఒకపూట పని విధానం కల్పించాలని కార్మికుల తరఫున సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గుండె శివకుమార్, ముత్యాలు, మున్సిపాలిటీ జవాన్ మైసయ్య, పోచయ్య, లింగయ్య, మహిళ కార్మికులు తదితరులున్నారు.







