Mahaa Daily Exclusive

  భువనగిరిలో ఉద్రిక్తత బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి…!

Share

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకులు దాడికి దిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూ నాయకులు గుంపుగా వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే కాంగ్రెస్‌ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపింది. పాలన చేతగాక, మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. దాడి గురించి తెలుసుకున్న కారు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సమాధానం చెప్పలేక దాడులా? : కేటీఆర్

బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.. కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించిందన్నారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలనని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుందని మండిపడ్డారు. మా పార్టీ కార్యకర్తలు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతోపాటు, వారి వెనక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? : హరీష్ రావు

భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడంపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడులు వంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తోందన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం?. ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీరు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా?. బీఆర్ఎస్ పార్టీపై గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అశాంతి, అలజడి రేపారన్నారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Latest