సంక్రాంతి సెలవుల వేళ సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా విహారానికని వెళ్తే అది కాస్త తీరని విషాదంగా మారింది. కొండపోచమ్మ సాగర్‌కు విహారానికి వెళ్లిన ఐడుగురు యువకులు సెల్ఫీ కోసం నీళ్లలో దిగగా ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు వదిలారు. ఇద్దరు యువకులను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. యువకులంతా హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపువారేనని గుర్తించారు. సంక్రాంతి సెలవులు రావటంతో హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వర్, సాహిల్, జతిన్, మృగాంక్, ఇబ్రహీం ఏడుగురు స్నేహితులు కలిసి సిద్దిపేటలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొండపోచమ్మ సాగర్ అందాలు ఆస్వాధిస్తూ నీళ్లలోకి దిగారు. నీళ్లలో కాసేపు ఆనందంగా కేరింతలు కొట్టారు. లోపలికి దిగి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయారు. అయితే యువకులకు ఈత రాకపోవటంతో ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకోవటంతో అందరూ నీటిలో మునిగిపోయారు. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడగా వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఐదుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగి చనిపోయిన యువకులు ధనుష్(20) ఫోటో స్టూడియో వర్కర్, సోదరుడు లోహిత్ (17), చీకట్ల దినేశ్వర్ (17), సాహిల్ (19), జతిన్ (17) ఉన్నారు. గజ ఈత గాళ్ళు మృత దేహాలను వెలికి తీశారు. నీటి లోతును అంచనావేయలేక పోవడంతో వారంతా మునిగి చనిపోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో మృగాంక్ (17), ఎండీ ఇబ్రహీం (17) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చనిపోయిన అన్నదమ్ములైన ధనుష్, లోహిత్ భోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి నర్సింగరావుకు ఫోటో స్టూడియో ఉంది. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కూతురు వివాహమైంది. ధనుష్ తండ్రి ఫోటో స్టూడియో చూసుకుంటుండగా, లోహిత్ టీకేఆర్ కాలేజీలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం 8.30 గంటలకు స్నేహితులతో కలిసి బైక్‌లపై కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. అదే వారి చివరి ప్రయాణమైంది.
సిఎం తీవ్ర దిగ్బ్రాంతి
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు యువకులు గల్లంతవటంపై ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని.. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హరీశ్ రావు సంతాపం
మరోవైపు కొండపోచమ్మ సాగర్ ప్రమాదంపై మాజీ మంత్రి మాజీమంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు అకాల మరణం చెందటం మనస్సును కలిచి వేసిందని వాపోయారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.







