అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం లింగరాజు పాలెం గ్రామంలో గత నెల 31న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై లింగరాజుపాలెం గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సమితి వారు ఎస్ రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేసి నేటికీ 12 రోజులు అవుతున్నా పోలీసులు దుండగులను అరెస్టు చేయడంలో తీవ్రంగా విఫలం చెందారని పేర్కొంటూ, నిరసనగా శనివారం లింగరాజుపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీపీఎం నాయకులు, క్షత్రియ సేవా సమితి సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై నేటికీ రాష్ట్ర హోంమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే హోంమంత్రి స్పందించి దుండగులను అరెస్టు చేసే విధంగా పోలీస్ వారికి ఆదేశాలివ్వాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం. సత్యనారాయణ, ఎం. రాజేష్, గణపతి రాజు, ఎ. సీతారామరాజు, సాంబమూర్తి రాజు, సన్యాసిరాజు, డి. సీతారామరాజు, అప్పలనరసిహారాజు, వెంకట క్రృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.







