వడ్డెరులను చైతన్య పరిచిన పితామహుడు వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడైన, వడ్డెర జాతి పితామహుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా అధికారులు, వడ్డెర కుల సంఘం నాయకులు, బీసీ వెల్ఫేర్ అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డెర కుల సంఘం నాయకులు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్ మాట్లాడుతూ… నాడు మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారితో పోరులో వడ్డె ఓబన్న పాత్ర చాల కీలకమని పేర్కొన్నారు. బ్రిటీష్ వారితో వీరోచిత పోరాటం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడి వారికీ ఉద్యమ స్ఫూర్తిని వివరిస్తూ ధైర్యాన్ని నింపేవాడని కొనియాడారు. ఇంతటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, ధీరుడు అయిన వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, జిల్లా అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిసి డెవలప్మెంట్ అధికారులు కేశరామ్, మాధవరెడ్డి, పల్లపు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల శ్రీశైలం, ఓర్సు శ్రీనివాస్, కుమార్, రాష్ట్ర కార్యదర్శి పల్లపు విగ్నేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డేరంగుల రూప మహేశ్వరి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దండుగుల వెంకటరమణ, వరికుప్పల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.







