Mahaa Daily Exclusive

  కోటి రూపాయల కోడి పందెం..!

Share

సంక్రాంతి పండుగంటే పిండివంటలూ, రంగవల్లులూ ఎంత ఫేమస్సో.. కోడిపందేలు కూడా అంతే ఫేమస్. కోడిపందేల బరులు, కోడిపుంజులు.. ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు రాయలసీమలోనూ కోడిపుంజులు కూతపెట్టాయి.. బరిలోకి దిగి తొడకొట్టాయి.. కోడిపందేలపై కోట్ల వర్షం కురిసింది. అయితే ఇన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కోటి రూపాయల కోడిపందెం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ పందెం గురించి భోగి పండుగకు ముందు నుంచే చర్చ మొదలైంది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో ఈ పందెం నిర్వహించారు.

కుక్కట శాస్త్రం ప్రకారం మంచి ముహూర్తం కూడా చూసి పందెం ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ కోడి పందెం నిర్వహించారు. ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు పోటీపడ్డాయి. రూ.1.25 కోటితో ఈ పందెంకోళ్లను బరిలోకి దింపారు. హోరాహోరీగా పందెం జరగ్గా.. ఈ కోడిపందెం చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. అలాగే కోడిపుంజులపై కూడా భారీగా బెట్టింగ్ జరిగింది. చివరాఖరికి ఈ కోటి 25 లక్షల రూపాయల పందెంలో గుడివాడ ప్రభాకర్‌కు చెందిన నెమలి పుంజు విజేతగా నిలిచింది.