రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్‌లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. రద్దయిన ఏకశిల వెంచర్లో రియల్ బ్రోకర్స్ అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల బ్రోకర్లపై చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పేదల భూములు కబ్జా చేస్తూ తమ భూములంటూ అడిగిన పేదలపై దాడికి దిగిన వారిని బెదిరించడంతో ఈటల రంగప్రవేశం చేశారు. ఈటలే నేరుగా చేయిచేసుకోవడంతో బిజెపి కార్యకర్తలు కూడా చేతులకు పని చెప్పి బ్రోకర్లను తరిమారు. మరోవైపు తాము బ్రోకర్లం కాదని, వెంచర్ యాజమానులపై నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా దాడులు చేయడం ఎంపీ ఈటల రాజేందర్ కు తగదని తర్వాత ఏకశిలా వెంచర్ కు చెందిన పలువురు మీడియా సమావేశం నిర్వహించారు.







