బిజెపి శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు స్టీల్ ప్లాంట్ కార్మికులపై మంగళవారం చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జీవీఎంసీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ ఎం జగ్గు నాయుడు, వైస్ చైర్మన్ ఎం మన్మధరావులు మాట్లాడుతూ స్టీల్ కార్మికులు ఇష్టం లేకపోతే రిజైన్ చేసి ,విఆర్ఎస్ తీసుకొని బయటకు పొండని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈయన పచ్చి కార్పొరేట్ల ప్రతినిధిగా ,కార్మిక వ్యతిరేకంగా మాట్లాడారు. ఈయన వ్యాఖ్యలను జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని వీరు డిమాండ్ చేశారు.
కేంద్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందని, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఆశకు అంతం ఉండాలని, వివేకంతో మాట్లాడాలని ఆయన అన్నారు. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్యాకేజీని జేఏసీ స్వాగతించింది. ప్యాకేజీ తోనే తమ బాధ్యత తీరినట్లుగా కూటమి నాయకుల ప్రకటనలున్నాయి. ఇది సరికాదన్నది కార్మికుల ప్రజల అభిప్రాయమన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నాడు కేంద్ర ప్రభుత్వం 4890 కోట్లు పెట్టుబడి పెడితే, స్టీల్ ప్లాంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకు 54 వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చిందన్నది రాజుగారు గుర్తుంచుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పాడి ఆవు లాంటిది. మోడీ ప్రభుత్వం దీని అమ్మకం ఆపి, సైయిల్ లో విలీనం చేసి, సొంత గనులు కేటాయిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల ఆదాయం సమకూరుస్తుంది, ప్రజలఅభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ పాడి ఆవును అదాని, మిట్టల్, పోస్కో వంటి కసాయిలకు కట్టబెట్టవద్దని ప్రజల డిమాండ్. ప్రజా ప్రతినిధిగా కృష్ణ కుమార్ రాజు కసాయిల పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్యాకేజీ కూటమి ప్రభుత్వ, డబల్ ఇంజన్ సర్కారు వలనే వచ్చిందని ,కార్మికుల ప్రజల పోరాటం, సమ్మెల వల్ల కాదని బిజెపి ఎమ్మెల్యే అన్నారు. పోరాటమే లేకపోతే ఉక్కు పరిశ్రమ నిలిచి ఉండేదే కాదని, కేంద్రం దిగివచ్చేదే కాదని జగమెరిగిన సత్యం. దీనిని తక్కువ చేసి చూడడం కార్పొరేట్ల,యాజమాన్య ప్రతినిధి లక్షణం. దీనిని ఆయన బయట పెట్టుకున్నారన్నారు.
విష్ణుకుమార్ రాజు ఒక వాస్తవాన్ని అంగీకరించారు. స్టీల్ ప్లాంట్ రక్షణ బాధ్యత కార్మికుల కన్నా 100 రెట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి ప్రధాని చేత విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయం రద్దు చేయించాలి. సెయిల్ లో విలీనం చేయించాలి, సొంత గనులు కేటాయించాలి.8500 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఐదువేల ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి.ఆఫీసర్లు, పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికుల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలి .విఆర్ఎస్ , బదిలీలు పేరుతో ఆఫీసర్లు, పర్మినెంట్ కార్మికుల తగ్గింపు, టెండర్లు, 55సంవత్సరాల వయసు, మెడికల్ నిబంధనలతో వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు నిలిపివేయించాలని డిమాండ్ చేశారు.
ఈ బాధ్యతలను విష్ణుకుమార్ రాజు , కూటమి నేతలు పూర్తి చేస్తే కార్మికులు ప్రజలు మీకు దండలు వేస్తారు. వీటిని సాధించకపోతే ఇదే కార్మికులు, ప్రజలు విష్ణుకుమార్ రాజును కూటమినేతలను భవిష్యత్తులో రాజీనామా డిమాండ్ చేయక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. జె. అచ్యుతరావు, కే సత్యనారాయణ…..సిఐటియు జిల్లా నాయకులు వి కృష్ణారావు, ఓ అప్పారావు , పి పైడ్రాజు, కేఎం కుమార మంగళం, జి అప్పలరాజు, నగి రెడ్డి రామారావు, సి ఎఫ్ టి యు ఐ నాయకులు ఎం లక్ష్మి ,ఏ ఐ సి టి యు జిల్లా కార్యదర్శి కే శంకర్రావు ,ఐద్వా జిల్లా అధ్యక్షులు బి పద్మ ,బి ఈశ్వరమ్మ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే. సంతోష్ కుమార్, బి గణేష్ ,ఎస్ శ్రావణ్ కుమార్ , పి సురేష్ ,కెవిపిఎస్ జిల్లా నాయకులు కే పెంటారావు తదితరులు పాల్గొన్నారు.







