పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై అమానుష వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కడప డీసీసీ అధ్యక్షులు విజయ జ్యోతి డిమాండ్ చేశారు. కడపలో బుధవారం జిల్లా అధ్యక్షులు విజయ జ్యోతి గారు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అఫ్జల్ ఖాన్ అధ్వర్యంలో జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దళితులు, మైనార్టీల పట్ల కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం ,హోమ్ మంత్రి అమిత్ షా అణచివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులై బిజెపి ప్రభుత్వాన్ని, ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ,హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ తో కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ మతం పేరుతో విద్వేషాలు సృష్టించి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా భారత రాష్ట్రపతి జోక్యం చేసుకొని అమిత్ షా ను హోం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో అసెంబ్లీ కోఆర్డినేటర్స్, కడప నగర డివిజన్ ఇన్చార్జిలు, పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ , మహిళ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు







