Mahaa Daily Exclusive

  రాజకీయ నాయకుల ఫోటోలతో మోసాలు ..ఐఏఎస్‌నే బురిడీ కొట్టించాడు..!

Share

హైదరాబాద్, మహా : దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఓ నేరగాడిని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఐఏఎస్‌కు బురిడీ కొట్టించటమే కాకుండా సీఎంవోల లాబీయింగ్ చేసి కోట్లు కొట్టేసిన కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఖరీదైన బెంజి కారు, దాడులకు ఉపయోగిస్తున్న ఇనుప రాడ్డు, బ్యాటు, హాకీ స్టిక్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన సయ్యద్‌ బుర్హానుద్దీన్‌ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. పొలిటికల్‌గా తనకు తెలిసిన వారి సాయంతో ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ప్రముఖలతో ఫొటోలు దిగుతుంటాడు. అలా దిగిన ఫొటోలను తన నేరాలకు వినియోగించుకుంటాడు. రాజకీయ ప్రముఖులంతా తనకు బాగా పరిచయస్థులని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నమ్మించి మోసాలకు పాల్పడుతాడు. 2016లో ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారికి ఇలాగే బురిడీ కొచ్చించాడు. సదరు అధికారిపై సీబీఐ కేసు ఉండగా తనకు పీఎంవోలో పరిచయాలున్నాయని, కేసు నుంచి తప్పిస్తానని నమ్మించి రూ.1.5 కోట్లు వసూలు చేసి పత్తా లేకుండా పోయాడు. ఈ మోసం గురించి తెలుసుకున్న సీబీఐ బుర్హానుద్దీన్‌పై అప్పట్లోనే కేసు పెట్టింది. ఆ తర్వాత ఝార్ఖండ్‌ సీఎంవోకు వెళ్లాడు. రాహుల్‌గాంధీ వ్యక్తిగత సహాయకుడినంటూ అక్కడి అధికారులను, రాజకీయ నాయకులను నమ్మించాడు. మైనింగ్‌ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి రూ.కోట్లు కొల్లగొట్టి పరారయ్యాడు. రంగంలోకి దిగిన ఝార్ఖండ్‌ పోలీసులు బుర్హానుద్దీన్‌ను అరెస్టు చేశారు. అయినా తీరు మార్చుకోని బుర్హానుద్దీన్ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారిని కూడా మోసం చేశాడు. ఈడీ కేసు నుంచి తప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశాడు. ఇలా పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన కేటుగాడిపై లెక్కకు మించి కేసులు ఉన్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 8 కేసులు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4 కేసులు బుక్కయ్యాయి.

 

బుర్హానుద్దీన్‌ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలోనూ భూకబ్జాలు చేసేవాడు. ఇలా ఓ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. మొయినాబాద్‌ మండలం తొలకట్టలో 6 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి భూ యజమాని మహ్మద్‌బేగ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన 2023లో చోటు చేసుకోగా మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న బుర్హానుద్దీన్ చివరకు పోలీసులకు చిక్కాడు. అతడిపై రౌడీషీట్, పీడీ యాక్డ్ ప్రయోగించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.

Latest