Mahaa Daily Exclusive

  అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు  సన్న బియ్యం ఇవ్వబోతున్నాం…!

Share

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు

సన్న బియ్యం ఇవ్వబోతున్నాం

సీఎం రేవంత్ ఆలోచనను అందరూ అభినందించాలి

తప్పుదోవ పట్టిస్తున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే

కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్

ప్రయాణంలో ల్యాప్ టాప్ ద్వారా పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

 

మహా: కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రేషన్ కార్డుల ప్రక్రియ అర్హులైన వారందరికీ అందజేస్తామన్నారు. ‘రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుంది. సోసియా ఎకనమిక్ సర్వే, ప్రజా పాలన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వ కార్యాలయాలలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులను గుర్తించడం జరిగింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని, సాచురేషన్ మోడ్ లో కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వబోతుంది. జనవరి 26న రాష్ట్రంలో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇది అందరికీ కార్డులు అందే వరకు కొనసాగుతుంది. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ఏటా రూ. 7 వేల కోట్ల వ్యయం చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఇచ్చిన దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేవారు. కార్డుల నుంచి వచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులు బయట అమ్ముకునేవారు. కానీ, మనం ఇచ్చే బియ్యం ప్రతి ఒక్కరు తినే విధంగా ఉన్నాయి. మంచి బియ్యం ఇస్తున్నాం.. ఇది చాలా గొప్ప ముందడుగు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన గొప్ప ఆలోచన అందరూ అభినందించాలి. రేషన్ కార్డులు ఇప్పుడు రానివారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారికి అందరికి అందజేస్తాం. గ్రామాలలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అబద్దాలను తిప్పికొట్టి ప్రజలకు సరైన సమాచారం అందించాలి. ప్రజలకు అర్హులకు కార్డులు అందేలా చూడల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మనం తీసుకోవాలి’ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్ లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉర్సులో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో ల్యాప్ టాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు.