పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక రంగ అవకాశాలు ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పర్యాటక, ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని పారిశ్రామిక రంగ ప్రతినిధులకు తెలిపారు. పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక, ఆతిథ్య రంగాల్ని సేవా రంగాలుగా పరిగణన చేస్తున్న నేపథ్యంలో పర్యాటక రంగంతో పాటు ఆతిధ్య రంగాలైన హోటళ్లు తదితర వాటిని ఏర్పాటుచేసేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ను అభివృద్ధి చేయడం, ఐటీని ప్రోత్సహించడం, ఆన్ లైన్ పరీక్షల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటుకు అవకాశాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మినరల్స్ కు కూడా జిల్లాలో ఎక్కువ అవకాశాలు ఉన్నందున, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నిమ్మ గడ్డితో వస్తువుల తయారీ కేంద్రాల స్థాపనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానం క్రింద తయారి, సేవా రంగాలకు పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ రాయితీ, భూమార్పిడి, జిఎస్టి, వడ్డీ రాయితీ తదితర అంశాల్లో ప్రభుత్వ రాయితీ కల్పిస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, సహాయ సంచాలకులు పి.సీతారాము, రామకృష్ణ, ఐపిఓ కిరణ్, జిల్లా భూగర్భ జలాల అధికారి ఏ రాజశేఖర రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎన్.విజయ్ స్వరూప్, నాబార్డ్ ఏజీఎం దినేష్, జిల్లా రవాణా అధికారి ఎం.శశికుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి రామకృష్ణ, పారిశ్రామిక ప్రతినిధులు ఉదయభాను, శ్రీదేవి, ఇతర అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







