- ఖైరతాబాద్ ఖరారే?
- స్టార్ క్యాంపెయినర్ గా దానం
- మరో ఉప ఎన్నికకు కాంగ్రెస్ సై
- డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన పార్టీ
- అక్టోబర్ 31 లోగా నిర్ణయం తెలపమన్న సుప్రీం
హైదరాబాద్, మహా
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ రెడీ అయినట్టు డైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేం బీఆర్ఎస్సే అంటుండగా, ఒక్క దానం నాగేందర్ ను మాత్రం దాని నుండి మినహాయించి.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రకటించింది. పార్టీ మీరిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్ పార్టీ కోర్టులను ఆశ్రయించింది. దీంతో అక్టోబర్ 31లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం నిర్దేశించింది. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఉండడంతో ఆయన ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమైంది. ఈ క్రమంలోనే రాజీనామాకు సిద్దంగా ఉండాలని పార్టీ హైకమాండ్ ఇదివరకే సంకేతాలిచ్చింది. మహా పత్రికలో దీనిపై పలు కథనాలు వచ్చిన విషయం విదితమే. దానం కాంగ్రెస్ పార్టీనే అని జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ బహిరంగంగా అంగీకరించింది. దానం నాగేందర్ పేరును స్టార్ క్యాంపెయినర్‌గా చేర్చడం ద్వారా ‘ఫిరాయింపుల వివాదం’ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నిర్ణయం ద్వారా దానం నాగేందర్ అనర్హత వేటుకు గురైతే.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి మరో ఉప ఎన్నికకు కూడా కాంగ్రెస్ సిద్ధమేనని పరోక్షంగా హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో దానం నాగేందర్ పాత్ర.. ఫిరాయింపుల అంశాన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియగానే, ఖైరతాబాద్ బైపోల్ కు కాంగ్రెస్ సిద్దమవుతుందన్న సంకేతాలు ఉన్నాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అడుగులు దీనిని రుజువు చేస్తున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా రాజీనామా కు సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఖైరతాబాద్ విషయంలోనే సాంకేతికంగా కాంగ్రెస్ సిద్దంగా ఉందన్న చర్చలున్నాయి. కాంగ్రెస్ నిజంగా పై అంటే, సుప్రీం మరోసారి ఆగ్రహిస్తే 2026లో మరో బైపోల్ ఖాయమని భావిస్తున్నారు.
…








