- హెచ్ఏండీఏ నయా రికార్డు
- రికార్డు స్థాయిలో రూ.1225 కోట్ల ఆదాయం
- గతంతో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు
- హెచ్ఏండీఏ అద్భుతమైన సేవలు, అనూహ్యమైన ప్రగతి
- పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది
- మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కీలక విషయాలు వెల్లడి
హైదరాబాద్, మహా: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ సరికొత్త రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చింది. నగరం నలుమూలల విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఏండీఏ అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ, వేగవంతమైన పనితీరుతో ముందూ దూసుకుపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల లేఔట్ లు, విల్లా లేఔట్ ల అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. గత సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలలలోనే అనుమతుల మంజూరు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ అద్భుతమైన పనితీరును ప్రదర్శించి ప్రజల మన్ననలు అందుకుంటోంది. 26 శాతం బిల్డింగ్ అనుమతులు పెరిగాయి. హెచ్ఎండీఏ ప్రస్థానంలో ప్రధానమైన అంశం నిర్ధిష్ట కాలపరిమితిలో దరఖాస్తుల పరిష్కారం. ఈ ఏడాది దీనిలో గొప్ప ప్రగతిని సాధించింది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే చూస్తే గణనీయమైన పరిష్కారం సాధించింది.ఇది 2024లోని మొదటి తొమ్మిది నెలలతో పోలిస్తే 49 శాతం, 2023 తో పోలిస్తే 36 శాతం అధికం. భవన అనుమతుల కోసం మొత్తం 2,961 దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగాయి. వాటిలో 2,904 పరిష్కారం అయ్యాయి. అంటే 98 శాతానికి పైగా పరిష్కారం అయ్యాయి. (2024తో పోలిస్తే 47 శాతం, 2023తో పోలిస్తే 26 శాతం బిల్డింగ్ అనుమతులు పెరిగాయి). మొత్తం ఈ దరఖాస్తుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
మొత్తం 6,079 ఫైళ్ళు పరిష్కారం అయ్యాయి..
ఇకపోతే 2025లో హెచ్ఎండీఏ మొత్తం 3,677 కొత్త దరఖాస్తులను స్వీకరించిందని వీటిలో బహుళ అంతస్తుల భవనాల (ఎంఎస్బీ) అనుమతులు, ఓపెన్ ప్లాట్‌లతో లేఅవుట్, గృహాలతో లేఅవుట్ మరియు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని హెచ్ఏండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వాటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసి 79 శాతం ఆమోద రేటును సాధించమని ఆయన వివరించారు. 2024లో 3,209 కొత్త దరఖాస్తులలో 1,216 అనుమతులు ఇచ్చి 38 శాతం ఆమోదం రేటు సాధించమని అన్నారు. 2023లో కొత్త దరఖాస్తులకు అనుమతులను ఇవ్వడంలో 58 శాతం ఆమోద రేటు నమోదయ్యిందని ఆయన చెప్పారు. 2023 ముందు కన్నా ఇప్పుడు అనుమతులు మంజూరు చేయడంలో గణనీయమైన వేగాన్ని సాధించామని తెలిపారు. నిర్మాణదారులకు, ప్రజలకు తమ సంస్థ ఒక నమ్మకాన్ని కలిగించడంతో వారిలో సానుకూల స్పందన వస్తోందని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్పరాజ్ తెలిపారు.నిర్ధిష్ట కాలపరిమితిలో వివిధ భవనాలు, లేఔట్ లు, లేఔట్ గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో కూడా హెచ్ఏండిఏ ఉన్నత ఫలితాలను సాధించిందని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. 2025 జనవరి నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 6,079 ఫైళ్ళు పరిష్కారం అయ్యాయని, ఇది 2024తో పోలిస్తే 49 శాతం మరియు 2023తో పోలిస్తే 36 శాతం అధికం అని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు హెచ్ఎండిఏ నిబద్ధతను ప్రతిబింబిస్తాయని ఇది పౌరులు, నిర్మాణదారులు మరియు పెట్టుబడిదారుల కోసం విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తోందని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
ఫైళ్లను త్వరతగతిన పరిష్కరిస్తున్నాం..
ఫైళ్ళను త్వరితగతిన పరిష్కరించడంలో హెచ్ఎండీఏ ముందు వరుసలో ఉంది అని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ఫైళ్లను త్వరతగతిన పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలన, ఇందుకు సంబంధించి ప్రతి అధికారిని జవాబుదారీ చేయడం, కమిషనర్ స్థాయిలో రోజువారీ వాటిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం పెండింగ్ ఫైళ్ళను ఒక నిర్ధిష్ట కాలపరమితి ప్రకారం విభజించి వాటిని పరిశీలించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. 60 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, 30 నుండి 60 రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, 30 రోజుల లోపు పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, వారం రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళుగా మొత్తం ఫైళ్ళను విభజించుకుని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తోంది హెచ్ఎండిఏ. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని హెచ్ఎండీఏ కమిషనర్ తెలిపారు. మొత్తం దరఖాస్తుల రావడం, వాటిని పరిష్కరించడం తమ పని విధానంలో చాలా ముఖ్యంగా భావిస్తున్నామని, అందుకే మంచి ఫలితాలు సాధించగలిగామని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు.








