- ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం!
- రైతులను ఇబ్బందులు పెట్టి మద్దతు ధరలో కోత విధించొద్దు
- అన్యాయం చేయాలని చూసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
- సీసీఐ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక
ఖమ్మం, మహా: భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తేమ శాతం పేరుతోగానీ, తరుగు పేరిట గానీ రైతులను అనవసరంగా ఇబ్బందులు పెట్టి మద్దతు ధరలో కోత విధిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులను, మిల్లు యజమానులను హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండలం గోల్ తండా గ్రామంలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీ బాయితో కలిసి మంగళవారం మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత వానాకాలం సీజన్ 2025లో పాలేరు నియోజకవర్గంలో ప్రారంభమైన మొట్టమొదటి సీసీఐ కేంద్రం ఇదేనని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
రైతులు తమ పత్తిని ఎలాంటి ఆందోళన లేకుండా అమ్ముకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. ప్రతి సీసీఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను, ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతులకు అన్యాయం చేయాలని చూసేవారిపై ఈ కమిటీ తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ, డిసిసిబి డైరెక్టర్ బి. రాజశేఖర్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








