Mahaa Daily Exclusive

  అన్ని చెక్ పోస్టులు రద్దు…రవాణా కమిషనర్, డీటీఓలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Share

  • అన్ని చెక్ పోస్టులు రద్దు
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలి
  • రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చలాన్లను అన్నింటినీ భద్రపరచాలి
  • అక్కడే విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలి
  • రవాణా కమిషనర్, డీటీఓలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ డీటీఓలకు ఆదేశాలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, చెక్ పోస్టులు మూసివేయబడినట్టుగా కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచిస్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను తక్షణం తొలగించాలని డీటీఓలకు ఆదేశాలు జారీ చేశారు.

మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలి..
ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలనకు సంబంధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీటీవో కార్యాలయంలో భద్రపరచాలని ఆదేశించారు. ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చెక్‌ పోస్టులను రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ ఆదేశాలు..
ఇక బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్‌ పోస్టులను రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని రవాణాశాఖ చెక్‌పోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెలరోజులు ఆలస్యంగా జీఓ జారీ అయ్యింది. ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా చెక్‌పోస్టులను ఇంకా తొలగించలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో తొలగింపు ప్రక్రియ మొదలైంది

Latest