Mahaa Daily Exclusive

  నన్ను క్షమించండి…కవిత హాట్ కామెంట్స్

Share

  • నన్ను క్షమించండి..
  • అమరవీరుల కోసం కొట్లాడలేకపోయా
  • ఇంటి గుట్టు బయట పెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకు పంపించారు
  • 20 ఏళ్లు కేసీఆర్, బీఆర్ఎస్‌కు పని చేశా.. ఇప్పుడు నా దారి వెతుక్కున్నా
  • ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం
  • ‘జాగృతి జనం బాట’ ప్రారంభ కార్యక్రమంలో కవిత హాట్ కామెంట్స్

నిజామాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అమరవీరుల ఆశయాలను పూర్తిగా నెరవేర్చడంలో, ఉద్యమకారులకు అనుకున్న స్థాయిలో న్యాయం చేయించడంలో గట్టిగా కొట్లాడలేకపోయినందుకు తనను మనస్ఫూర్తిగా క్షమించమని కోరారు. ‘ జాగృతి జనం బాట ’ పేరుతో 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు కవిత శనివారం నుంచి నిజామాబాద్ బయలుదేరారు. అంతకుముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులయ్యారని గుర్తు చేసిన కవిత.. వారి కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామన్నారు. ‘కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని చోట్ల ఎంపీపీ, జడ్పీటీసీ టిక్కెట్లు దక్కినప్పటికీ.. వారికి దక్కాల్సిన న్యాయం జరగలేదు. అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో “జాగృతి జనంబాట” ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా?. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. 20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా. ఇంటి గుట్టు బయట పెట్టి… కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా. ఇది నా గడ్డ. ఎప్పటికైనా ఈ గడ్డలోనే కలిసిపోతా. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే నా మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ ఈ జిల్లాలోని కందకూరులో పుట్టారు. ఇంకో పక్క మనాల అడవుల్లో ఎన్ కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఉంది. ఆర్ఎస్ యూ, నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరికీ మద్దతు ఇచ్చిన చరిత్ర మన జిల్లాది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి సారి నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ గెలిచారు. అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుంది. అన్ని భావాజాలలకు మద్దతునిస్తూ ముందున్నటువంటి జిల్లా మనది. మీ బిడ్డను కాబట్టి నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ కు పంపించారు. మీ మర్యాద, గౌరవం కాపాడే విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను. బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి అన్ని సీట్లు గెలిపించారు. నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చా. గత 20 ఏళ్లుగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా. మీ కోడలిగా, బిడ్డగా నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురుచూశా.నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే. కానీ నన్ను కుట్ర చేసిన పంపించారు. నిజామాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరుతున్నా.

ఈ ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ ఇస్తలేదు. పెన్షన్ కోసం ప్రభుత్వం పై పిడికిలి బిగించి కొట్లాడాలె. ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోంది. గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు. ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది. ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు రావాలె. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా పెన్షన్ రావాలి. ఇంకా అనేక అంశాలు, విషయాలు ఉన్నాయి. వాటిపై పోరాటం చేయాల్సి ఉంది. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతాను. ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేస్తాను. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా .. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు…ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలి. పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇక గురుకులాల్లో ఆత్మహత్యలు, ఎలుకలు విద్యార్థులను కొరకటం, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలె. కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతున్నారు. ఈ జిల్లాకే చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదు. సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేకపోతున్నారు. బంగారు లేడినో, ఆకాశం లో పక్షినే మనం అడగటం లేదు. మనకు మంచి తిండి కావాలని అడుగుతున్నాం. బీఆర్ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. ఇన్నాళ్లు కేసీఆర్ నీడలో ఉన్నా. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు అని’ అన్నారు

Latest