Mahaa Daily Exclusive

  ట్రంప్‌ను నిలదీసే ధైర్యం మోడీకి ఉందా?

Share

  • ట్రంప్‌ను నిలదీసే ధైర్యం మోడీకి ఉందా?
  • ఓట్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడబోరు
  • మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్లు

బీహార్, మహా: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధానిపై విమర్శలు చేశారు. ఆదివారం బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ మాట్లాడుతూ.. ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏం చేయడానికైనా వెనకాడబోరని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ బిహార్‌కు వచ్చి అనేక ప్రసంగాలు, వాగ్దానాలు చేస్తారని.. ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడరని రాహుల్‌ విమర్శించారు. బిహార్‌లో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగం గురించి ప్రశ్నలు లేవనెత్తకుండా.. యువత దృష్టిని మళ్లించడానికి వారిని రీల్స్‌ చూడాలని మోదీ కోరుతున్నారని రాహుల్‌ అన్నారు. రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నలంద వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్ని బిహార్‌లో ప్రారంభిస్తామన్నారు. ఇండియా కూటమిని ఎన్నుకుంటే రాష్ట్రంలో రైతులు, కార్మికులు, దళితులు, బలహీనవర్గాలకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. భారత్‌-పాక్‌ సైనిక ఘర్షణను ఆపానని ట్రంప్‌ పదేపదే చెబుతున్నప్పటికీ.. ఆయనను నిలదీసి ప్రశ్నించే ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలు వంటి నిర్ణయాలన్నీ దేశంలోని కొందరు వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేవేనన్నారు. కానీ తాము మాత్రం చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఇతర పరికరాలపై మేడిన్‌ బిహార్‌ అనే ముద్రను చూడాలనుకుంటున్నామన్నారు