- తెలంగాణలో విన్‌గ్రూప్ పెట్టుబడులు..
- సీఎం రేవంత్‌రెడ్డితో ఢిల్లీలో విన్ గ్రూప్ సీఈవో భేటీ
- రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి.. సీఎంతో చర్చలు సఫలం
- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆహ్వానించిన రేవంత్
ఢిల్లీ, మహా: వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సన్ చౌ శనివారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు స్థాపించడానికి తమకున్న ఆసక్తిని వ్యక్తం చేశారు. విన్‌గ్రూప్ తరపున తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ యూనిట్లు బ్యాటరీ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి గల ఆసక్తిని ఫామ్ సన్ చౌ సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్రంలో సౌర పవన శక్తి ప్రాజెక్టుల విస్తరణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆయన చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై సీఈఓ ప్రత్యేక ఉత్సాహం చూపించారు. దాని అభివృద్ధిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని విన్‌గ్రూప్ సంసిద్ధతను తెలియజేశారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలి..
ఈ పెట్టుబడుల ఆసక్తితో, తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ముందు చూపుతో కూడిన, పచ్చని, ఆవిష్కరణల నేతృత్వంలో అభివృద్ధిని సాధించే దిశగా ముఖ్యమైన అడుగు వేసింది. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫామ్ సన్ చౌను విన్‌గ్రూప్ ఛైర్మన్ ఫామ్ నట్ వుయోంగ్ను కూడా డిసెంబర్ 8–9 తేదీల్లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని లాంఛనంగా ఆహ్వానించారు. విన్‌గ్రూప్ సీఈఓ ఫామ్ సన్ చౌ ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దార్శనిక పరిధిని గుర్తించి, దాని అభివృద్ధిలో చురుకుగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ చర్చలు తెలంగాణ ప్రభుత్వం సుస్థిర స్వచ్ఛ ఇంధనం విస్తరణపై దృష్టి సారించిన విధానాలకు అనుగుణంగా ఉన్నాయి. తద్వారా రాష్ట్రంలో సుదీర్ఘకాలం ఉండే పారిశ్రామికాభివృద్ధికి ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి.








