- సూక్మా జిల్లాలో తుపాకుల మోత
- భారీ ఎన్‌కౌంటర్
- ముగ్గురు మావోయిస్టులు మృతి, మృతుల్లో ఇద్దరు మహిళలు
- కొనసాగుతున్న కూంబింగ్
చత్తీస్గడ్, మహా : చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టులపై భద్రతా దళాలు మరోసారి పంజా విసిరాయి. సుక్మా జిల్లాలో ఆదివారం ఉదయం మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇంకా మరికొందరు మావోయిస్టులు దాడిలో చిక్కి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని ముట్టడి చేశారు. లభించిన వివరాల ప్రకారం సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా మావోయిస్టుల సమూహం కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు వైపులా గంటల పాటు కాల్పులు కొనసాగాయని సమాచారం. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పలు తుపాకులు, పేలుడు పదార్థాలు, మావోయిస్టుల సామగ్రిను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, అడవి ప్రాంతంలో ముమ్మర గాలింపు సాగుతోందని పోలీసులు వెల్లడించారు. సుక్మా – బీజాపూర్ అటవీ మండలాల్లో ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరగడంతో భద్రతా దళాలు అప్రమత్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మావోయిస్టుల వద్ద ఉన్న 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినవారిని మిలిషియా కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడైన మద్వి దేవా, సీఎన్ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి గంగిగా గుర్తించారు. ఎన్కౌంటర్లో హతమైన మావోస్టులపై చెరో రూ.5 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు.
సుక్మా జిల్లాలోని భేజ్జీ, చింతగుఫా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో జిల్లా రిజర్వ్గార్డ్ (డీఆర్జీ) ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఆదివారం ఉదయం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. గతంలో అమాయక ప్రజలపై జరిగిన అనేక దాడుల్లో వీరి హస్తం ఉందని అధికారులు తెలిపారు.
మరణించిన మావోయిస్టుల వివరాలను అధికారులు ప్రకటించారు. మద్వి దేవా
ఇతడు మిలిషియా కమాండర్, ప్రసిద్ధ స్నిపర్, కొంటా ఏరియా కమిటీ సభ్యుడు. మద్వి దేవాపై రూ.5 లక్షల రివార్డు ఉంది. అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు తీయడం, సైనికులపై దాడుల్లో మద్వి దేవా హస్తం ఉంది. పోడియం గంగి . సీఎన్ఎం కమాండర్ అయిన పోడియం గంగి, కొంటా ఏరియా కమిటీ సభ్యురాలు. ఆమెపై రూ.5 లక్షల రివార్డు ఉంది. సోడి గంగి
సోడి గంగి కిష్టారామ్ ఏరియా కమిటీలో చురుకైన సభ్యురాలు. ఆమెపై రూడా రూ.5 లక్షల రివార్డు ఉంది.
ఎన్ కౌంటర్ పై స్పందించిన ఐజీ సుందర్ రాజ్
ఎన్కౌంటర్పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పట్టిలింగం స్పందించారు. బస్తర్ ప్రాంతంలో మావోయిజం ఇప్పుడు చివరి దశలో ఉందన్నారు. మావోయిస్టు కేడర్ హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం తప్ప వారికి వేరే మార్గం లేదని తెలిపారు. నిర్ణీత సమయంలోపు బస్తర్లో నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. సైనికుల ధైర్యం మావోయిస్టుల వ్యూహాన్ని విఫలం చేసిందన్నారు. “ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ. 2025 లో ఇప్పటి వరకు 233 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ లీడర్లు ఉన్నారు.” అని సుందర్ రాజ్ తెలిపారు.








