- జూబ్లిహిల్స్ ఫలితం
- హిందువుల్లో పెరిగిన కసి
- ఘర్ వాపసీకి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మహా : జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాతనైనా హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న హిందువులంతా ఓటుబ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. ఆదివారం కూకట్ పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి హాజరైన ఆయన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లిహిల్స్ ఫలితం తరువాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. అక్కడ ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇకనైనా హిందువులు మేల్కొని ఓటుబ్యాంకుగా మారాలన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన వారంతా ఘర్ వాపసీ రావాలని కోరారు. హిందూమతంలోకి తిరిగి వచ్చేవారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, హిందువుగా పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూ హిందూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందన్నారు. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదన్నారు. ఇక కార్తీక వనభోజనాలు నిర్వహిస్తోన్న అన్ని కులాల సభ్యులకు అభినందనలు తెలిపారు. అన్ని కులాలు హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు.








