Mahaa Daily Exclusive

  ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు…ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

Share

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
  • జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఘటన
  • ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

జనగామ, మహా : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి తెలంగాణ ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో దుండిగల్ కు చెందిన పులమాటి ఓం ప్రకాష్ (75), బాలసముద్రంకు చెందిన నవదీప్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వసమైంది. రాజధాని బస్సు అత్యంత వేగంతో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాజధాని బస్సు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ నిద్ర లేమి వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఆర్టీసీ అధికారులు ప్రమాదస్థలికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు.

Latest