- అవినీతి, అక్రమాలను వెలికితీస్తాం
- నిరంజన్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయం
- ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్, మహా: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలను వెలికితీసే పనిలో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిరంజన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ, నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడినందున, ఆయనను జైలుకు పంపడం ఖాయమని ఉద్ఘాటించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నిరంజన్ రెడ్డి రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారని, ఆ భూమిని సర్వే చేయించి ఇప్పటికే ప్రభుత్వానికి స్వాధీనం పర్చినట్లు తెలిపారు. ఆయన సొంత గ్రామం కొత్తపేటలోని వ్యవసాయ క్షేత్రానికి ఉపయోగించుకున్న కరెంటు, కెనాల్ నీళ్ల మళ్లింపు అంతా అక్రమమేనని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేయించినట్లు తెలిపారు. పెద్దమందడి మండలం, వెల్టూరు చెరువు వద్ద జరుగుతున్న అక్రమ నీటి దోపిడీని ప్రభుత్వం నిలువరించిందని పేర్కొన్నారు.
నిరంజన్ రెడ్డికి సవాల్..
తూడి మెగా రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సవాలు విసురుతూ, దమ్ము ధైర్యం ఉంటే దేవుని ఎదుట అవినీతికి, అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, నిన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమని సమర్థించారు. నిరంజన్ రెడ్డి ఇంట్లోనే ఉండే దత్తపుత్రుడిపై తీసుకున్న సబ్సిడీ లోన్లు, చేసుకున్న కాంట్రాక్ట్ పనులు అన్ని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. కవిత మాట్లాడిన మాటలకు వేరే వాడైతే ఊరు విడిచిపెట్టి వెళ్తుండే, కానీ ఈయనకు సిగ్గు శరం ఏదీ లేదని తూడి మెగా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.








