- పోలీసు శాఖలో కలకలం
- బెట్టింగ్ యాప్ తో అప్పుల పాలై
- సర్వీస్ గన్ను తాకట్టు పెట్టిన ఎస్సై
- అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు
హైదరాబాద్, మహా : బెట్టింగ్ యాప్ లకు బానిసగా మారిన ఒక సబ్ ఇన్ స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ ను అమ్మేసి ఉన్నతాధికారులను బోల్తా కొట్టించి తప్పుచుకునేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. పోలీసు శాఖలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న ఈ సంఘటన అంబర్ పేట పోలీసు స్టేషన్ లో జరిగింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎస్సైగా పని చేస్తున్న భానుప్రకాష్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఎస్సై చేసిన అక్రమాలు పోలీసు శాఖ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చే విధంగా తయారైంది. క్రైమ్ కేసులను ఛేదించాల్సిన ఎస్సై.. తాను దర్యాప్తు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును కాజేయడమే కాకుండా.. ప్రభుత్వం కేటాయించిన 9 ఎంఎం రివాల్వర్‌ను సైతం అమ్మేసుకున్నాడనే ప్రచారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఎస్సైకి కేటాయించిన కీలకమైన సర్వీస్ పిస్టల్ కనిపించకుండా పోవడంపై పోలీసు ఉన్నతాధికారులు విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం భానుప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రివాల్వర్‌ను రాయలసీమలోని ఏదైనా ముఠాలకు లేదా ఇతర నేరగాళ్లకు విక్రయించాడా? లేక తాకట్టు పెట్టాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్ అంబర్పేట్ పీఎస్‌లో క్రైమ్ ఎస్సైగా పనిచేస్తూ ఇటీవల ఒక ఫిర్యాదులో 4 తులాల బంగారం చోరీ కేసు దర్యాప్తు చేపట్టాడు. ఈ కేసులో బంగారాన్ని రికవరీ చేసినప్పటికీ బాధితులకు ఆ సొత్తును అప్పగించలేదు. బదులుగా వారికి త్వరలో బంగారం ఇస్తానని నమ్మబలికి లోక్ అదాలత్‌లో కేసును క్లోజ్ చేయించాడు. కేసు క్లోజ్ అయిన తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా దానిని తాకట్టు పెట్టి డబ్బులు స్వంతానికి వాడుకున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అతనిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. భానుప్రకాష్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని.. తరచుగా సెలవులు పెడుతూ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని తోటి ఉద్యోగులకు చెప్పేవాడని విచారణలో తేలింది. ఈ సమయంలోనే అతడు బెట్టింగ్ వ్యసనంలో పడిపోయి దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ అప్పులు తీర్చడానికి డబ్బు అవసరమవ్వడంతోనే భానుప్రకాష్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడని రికవరీ చేసిన సొత్తును కాజేశాడని సమాచారం.
సస్పెండ్ అయిన తర్వాత భానుప్రకాష్ ఇటీవల అంబర్పేట్ పీఎస్‌కు వచ్చి తనకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నానని తోటి సిబ్బందికి చెప్పాడు. స్టేషన్లో తన వస్తువులు తీసుకోవడానికి వచ్చినట్లు నమ్మించాడు. అనంతరం స్టేషన్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి తన డ్రాలో పెట్టిన 9 ఎంఎం పిస్టల్ కనిపించడం లేదని, సీసీటీవీ కెమెరాలు చూడాలని కోరాడు. ఉన్నతాధికారుల సమక్షంలో డ్రాను పరిశీలించగా బుల్లెట్లు మాత్రమే దొరికాయి, కానీ పిస్టల్ కనిపించలేదు. ఈ సంఘటనతో పిస్టల్ మిస్సింగ్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా భానుప్రకాష్ రికవరీ చేసిన 4 తులాల బంగారాన్ని డ్రాలో పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లిన దృశ్యాలు లభ్యమయ్యాయి. అయితే గన్ గురించి మాత్రం తనకు తెలియదని, డ్రాలోనే పెట్టానని భానుప్రకాష్ విచారణలో చెబుతున్నట్లు సమాచారం. అధికారులు అధికారికంగా దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. స్వంత శాఖలోనే పని చేస్తున్న ఎస్సై నిర్వాకం బయటకు వస్తే పోలీసు శాఖ పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో అధికారులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.
బెట్టింగ్ వ్యసనం… అప్పులు పెరగడంతో అడ్డదారులు
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం, ఎస్సై భాను ప్రకాశ్ ఇటీవలి కాలంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుని, భారీ అప్పుల పాలయ్యాడని అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చేందుకు అధికారిక విధుల్లో స్వాధీనం చేసిన ఆస్తులపై కన్నేశాడు. తాజా కేసులో రికవరీగా స్వాధీనం చేసుకున్న 5 తులాల బంగారాన్ని భాను ప్రకాశ్ తన వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నాడని దర్యాప్తులో తేలింది. బంగారం మిస్సింగ్ కావడంతో ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేసి విచారణను వేగవంతం చేశారు.
సర్వీస్ గన్ కూడా కనిపించకపోవడంతో అసలు కథ వెలుగులోకి
ఎస్సై వద్ద ఉండాల్సిన సర్వీస్ తుపాకీ కనిపించకపోవడం అధికారులు గమనించారు. వివరణ అడిగినప్పటికీ భాను ప్రకాశ్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో లోతుగా చర్చించి పరిశీలించగా, సర్వీస్ గన్ను కూడా ఒక బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టినట్లు అనుమానాలు బలపడ్డాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు వెంటనే టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. తాజా సమాచారం ప్రకారం, భాను ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం, సర్వీస్ వెపన్ ఎక్కడ తాకట్టు పెట్టారో, ఇంకెవరెవరైనా ఇందులో పాలుపంచుకున్నారా అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది.
పోలీస్ శాఖలో కలకలం
బాధ్యతాయుతమైన పదవిలో ఉండే అధికారే ఇలాంటి దుర్వినియోగాలకు పాల్పడడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ ఘటనపై ఉన్నతాధికారులు అత్యంత కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.








